బ్రాండ్ అంబాసిడర్ మహేష్ బాబుతో ఉదయ్ రెడ్డి
• 2017లో భారత్‌లో పేపర్ వ్యూ
• కంపెనీ ఫౌండర్ ఉదయ్ రెడ్డి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్నెట్ ఆధారిత లైవ్ టీవీ, ఆన్ డిమాండ్ సేవలు అందిస్తున్న యప్ టీవీ నూతన ప్రచార కర్తగా మహేష్ బాబు నియమితులయ్యారు. రెండేళ్లపాటు కంపెనీకి ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారు. మహేష్ రాక ప్రపంచవ్యాప్తంగా మరింత మంది వీక్షకులను చేరుకునేందుకు దోహదం చేస్తుందని యప్ టీవీ ఫౌండర్ ఉదయ్ రెడ్డి సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘పే పర్ వ్యూ’ సేవలను 2017లో భారత్‌లో పరిచయం చేస్తామన్నారు. విడుదలైన నాల్గవ వారం తర్వాత కొత్త సినిమాలను యప్ టీవీలో నిక్షిప్తం చేస్తారు. చందా చెల్లించడం ద్వారా ఆ సినిమాను వినియోగదార్లు వీక్షించొచ్చు. పైరసీని అరికట ్టడంలో పే పర్ వ్యూ దోహదం చేస్తుందని ఈ సందర్భంగా మహేష్ బాబు వ్యాఖ్యానించారు. పే పర్ వ్యూ సర్వీసును యూఎస్‌లో కంపెనీ అందిస్తోంది.
మరో 300 మంది సిబ్బంది..
యప్ టీవీకి ప్రస్తుతం 300 మంది ఉద్యోగులు ఉన్నారు. వచ్చే రెండు మూడేళ్లలో మరో 200-300 మందిని నియమించుకుంటామని ఉదయ్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే రూ.330 కోట్ల దాకా సమీకరించనున్నట్టు పేర్కొన్నారు. కంటెంట్, కస్టమర్ల సంఖ్య పెంచుకునేందుకు ఈ మొత్తాన్ని వినియోగిస్తామని చెప్పారు. దేశంలో 4జీ సేవలు విస్తృతమైతే వీడియోల వీక్షణం గణనీయంగా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి నెల 70 లక్షల మంది యప్ టీవీ ద్వారా పలు చానెళ్లను, వీడియోలను వీక్షిస్తున్నారని చెప్పారు. సొంతంగా కంటెంట్‌ను అభివృద్ధి చేసి ప్రత్యేకంగా అందిస్తామన్నారు. 12 భాషల్లో 200లకుపైగా టీవీ చానెళ్లు, 5 వేల పైచిలుకు సినిమాలను యప్ టీవీ ఆఫర్ చేస్తోంది.