
న్యూఢిల్లీ: మహీంద్రా గ్రూప్ ఫోర్డ్ మోటార్‌తో కలసి కొత్త ఎస్‌యూవీలను అభివృద్ధి చేయనున్నది. అంతేకాకుండా ఒక చిన్న ఎలక్ట్రిక్ వెహికల్‌ను కూడా అందుబాటులోకి తేనున్నది. గత ఏడాది ఇరు కంపెనీల మధ్య కుదిరిన వ్యూహాత్మక ఒప్పందాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో భాగమే ఇదంతా అని మహీంద్రా అండ్ మహీంద్రా ఎమ్‌డీ పవన్ గోయెంకా పేర్కొన్నారు. దీంట్లో భాగంగానే ఇరు కంపెనీలు తాజాగా ఐదు ఒప్పందాలను కుదుర్చుకున్నాయని తెలిపారు. దీంట్లో భాగంగా ఇరు సంస్థలు కలసి మిడ్‌సైజ్ స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్‌ను అందుబాటులోకి తేనున్నాయని వివరించారు.
ఈ ఎస్‌యూవీని మహీంద్రా ప్లాట్‌ఫార్మ్‌పై తయారు చేస్తామని, ఇరు కంపెనీలు వేర్వేరు బ్రాండ్ల కింద ఈ ఎస్‌యూవీలను సొంతంగా విక్రయిస్తాయని తెలిపారు. ఇరు కంపెనీల ఉద్యోగుల మధ్య సహకారం కొనసాగుతుందని, మూడేళ్ల పాటు కలసి పనిచేస్తామని గోయెంకా తెలిపారు. యుటిలిటి వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ దృష్టిపెట్టాల్సిన కీలక అంశాలని ఫోర్డ్ ఎగ్జిక్యూటివ్ వైస్–ప్రెసిడెంట్ జిమ్ ఫార్లే పేర్కొన్నారు. వినియోగదారుల అభిరుచులు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాహనాలను అందిస్తామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment