
న్యూఢిల్లీ: దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) వివిధ రకాల వాహనాల రేట్లను రూ. 36,000 దాకా పెంచనుంది. జూలై 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. ప్యాసింజర్ వాహనాల్లో ఏఐఎస్ 145 భద్రతా ప్రమాణాల నిబంధనలు అమల్లోకి వస్తుండటంతో రేట్ల పెంపు అనివార్యమవుతోందని కంపెనీ వెల్లడించింది. స్కార్పియో, బొలెరో, టీయూవీ300, కేయూవీ100 ఎన్‌ఎక్స్‌టీ మోడల్స్‌పై అత్యధికంగాను, ఎక్స్‌యూవీ300 ..మరాజోపై స్వల్పంగా రేట్ల పెంపు ఉంటుందని మహీంద్రా వెల్లడించింది. ప్యాసింజర్ వాహనాల్లో డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్, సీట్ బెల్ట్ రిమైండర్, రియర్ పార్కింగ్ సెన్సర్ మొదలైన ఫీచర్స్‌ను తప్పనిసరి చేసే ఏఐఎస్ 145 భద్రత ప్రమాణాలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. భద్రతాపరమైన ఫీచర్స్ కారణంగా వ్యయాలు పెరిగిపోవడం వల్ల కొన్ని ఉత్పత్తులపై తామూ రేట్లు పెంచక తప్పడం లేదని ఎంఅండ్‌ఎం ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ విభాగం) రాజన్ వధేరా తెలిపారు. బీఎస్‌ఈలో బుధవారం ఎంఅండ్‌ఎం షేర్లు 1.7 శాతం క్షీణించి రూ. 615.25 వద్ద ముగిశాయి.