ఆర్థిక వ్యవస్థకు శుభ సంకేతాలు..!
♦ ద్రవ్యోల్బణం తగ్గింది.. పారిశ్రామికోత్పత్తి పెరిగింది..
♦ ఆరు నెలల కనిష్టానికి మార్చి రిటైల్ ద్రవ్యోల్బణం
♦ 3 నెలల క్షీణత తర్వాత ఫిబ్రవరిలో పుంజుకున్న ఐఐపీ
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు ఈ మంగళవారం రెండు మంచి వార్తలను అందించింది. మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆరు నెలల కనిష్టానికి పడిపోవడం, మూడు నెలల క్షీణత తర్వాత ఫిబ్రవరిలో పారిశ్రామికోత్పత్తి 2 శాతం వృద్ధి సాధించడం... భారత ఆర్థిక వ్యవస్థకు చేయూతనిస్తుందని నిపుణులంటున్నారు. ఫిబ్రవరిలో 5.26 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 4.83 శాతానికి, ఆహార ద్రవ్యోల్బణం 5.3 శాతం నుంచి 5.21 శాతానికి తగ్గినట్లు కేంద్ర గణాంకాల సంస్థ వెల్లడించింది. రిటైల్ ద్రవ్యోల్బణం ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయిందని పేర్కొంది. గత మూడు నెలల్లో క్షీణత నమోదు చేసిన పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) మైనింగ్, విద్యుత్, కన్సూమర్ రంగాలు మంచి పనితీరు కనబరచడంతో ఈ ఫిబ్రవరిలో పుంజుకుంది వివరాలు..
పారిశ్రామికోత్పత్తి ఫిబ్రవరి నెలలో 2 శాతం వృద్ధి సాధించింది. మైనింగ్, విద్యుత్, కన్సూమర్ రంగాలు మంచి పనితీరు కనబరచడంతో ఫిబ్రవరిలో పుంజుకుంది. ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతోందనడానికి ఇది సూచిక అని నిపుణులంటున్నారు. అంతకుముందు మూడు నెలల్లో పారిశ్రామికోత్పత్తి క్షీణత నమోదు చేసింది. కేంద్ర గణాంకాల సంస్థ(సెంట్రల్ స్టాటిస్టికస్ ఆఫీస్-సీఎస్‌ఓ) వెల్లడించిన గణాంకాల ప్రకారం.,
-ఫ్యాక్టరీ ఉత్పత్తిని ప్రతిబింబించే పారిశ్రామికోత్పత్తి సూచీ(ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్-ఐఐపీ) గత ఏడాది నవంబర్‌లో 3.4%, డిసెంబర్‌లో 1.2%, ఈ ఏడాది జనవరిలో 1.5% చొప్పున క్షీణించింది.
♦ గత ఫిబ్రవరిలో మైనస్ 3.8 శాతంగా ఉన్న కన్సూమర్ డ్యూరబుల్ గూడ్స్ (వినియోగదారుల మన్నిక వస్తువుల) సెగ్మెంట్ ఉత్పత్తి ఈ ఫిబ్రవరిలో 9.7 శాతానికి పెరగడంతో ఐఐపీ మెరుగుపడింది.
♦ పారిశ్రామికోత్పత్తి సూచీలో 75 శాతం వాటా ఉన్న తయారీ రంగం 0.7 శాతం వృద్ధిని సాధించింది.
♦ మైనింగ్ రంగం 5 శాతం వృద్ధి సాధించింది.
♦ విద్యుదుత్పత్తి 9.6 శాతానికి ఎగసింది.
♦ ఇక వినియోగదారుల ఆధారిత వర్గీకరణ పరంగా చూస్తే, ప్రాధమిక వస్తూత్పత్తి రంగం వృద్ధి 5.4 శాతానికి పెరిగింది.
♦ పెట్టుబడుల ప్రవాహానికి ప్రతీకగా భావించే యంత్ర పరికరాల తయారీ 8.3 శాతం వృద్ధి నుంచి మైనస్ 9.8 శాతానికి పడిపోయింది.
♦ మొత్తం మీద 22 పరిశ్రమల గ్రూపుల్లో 16 వృద్ధిని నమోదు చేశాయి.
రిటైల్ ద్రవ్యోల్బణం 4.83 శాతం చౌకైన కూరగాయలు, పప్పుల ధరలు
న్యూఢిల్లీ: కూరగాయలు, పప్పుల ధరలు చౌకగా ఉండటంతో మార్చి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.83 శాతానికి పడిపోయింది. వినియోగదారుల ధరల సూచీ (కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్-సీపీఐ)గా పరిగణించే రిటైల్ ద్రవ్యోల్బణానికి ఇది ఆరు నెలల కనిష్ట స్థాయి. ఇక ఫిబ్రవరి రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 5.18 శాతం నుంచి 5.26 శాతానికి సవరించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.41 శాతంగా నమోదైంది. ఈ ఫిబ్రవరిలో 5.3 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం ఈ మార్చిలో 5.21 శాతానికి తగ్గిందని గణాంకాలు వెల్లడించాయి. వివరాలు...,
♦ ధరల పెరుగుదల రేటు కూరగాయల్లో 0.54%, నూనెలు, కొవ్వులకు 4.85%, పాలు, పాల ఉత్పత్తులకు 3.33%గా ఉంది. -పండ్ల ధరలు 1.10% తగ్గగా, పప్పుల ధరలు కూడా చౌకఅయ్యాయి.
♦ ఫిబ్రవరిలో 0.51% పెరిగిన పంచదార, స్వీట్ ఉత్పత్తుల ధరలు ఈ మార్చిలో 3.92% పెరిగాయి. అలాగే పాన్, పొగాకు ఉత్పత్తుల ధరలు 8.39 శాతం నుంచి 8.51 శాతానికి ఎగిశాయి.
♦ తృణ ధాన్యాల ధరలు 2.43% పెరిగాయి. మాంసం, చేపల ధరలు 7.74%, కోడిగుడ్ల ధరలు 6.68 శాతం చొప్పున పెరిగాయి.
♦ సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణ రేటు గ్రామీణ ప్రాంతాల్లో 5.7 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 3.95 శాతంగా నమోదైంది.