జీడీపీ డేటాపై మార్కెట్‌ దృష్టి | Market focus on GDP data | Sakshi
Sakshi News home page

జీడీపీ డేటాపై మార్కెట్‌ దృష్టి

Published Mon, Nov 27 2017 12:18 AM | Last Updated on Mon, Nov 27 2017 12:22 AM

Market focus on GDP data - Sakshi - Sakshi

న్యూఢిల్లీ: జీడీపీ, పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ)గణాంకాలు ఈ వారం మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులంటున్నారు. నవంబర్‌ సిరీస్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టులు ఈ వారంలోనే ముగియనున్నందున ఒడిదుడుకులు చోటు చేసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మూడీస్‌ సంస్థలా స్టాండర్డ్‌ అండ్‌ పూర్స్‌ సంస్థ మన రేటింగ్‌ను పెంచకపోవడం వారం ప్రారంభంలో ఒకింత ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. గత శుక్రవారం మార్కెట్‌ ముగిసిన తర్వాత ఎస్‌ అండ్‌ పీ రేటింగ్‌ ప్రకటన వెలువడింది.  

30న జీడీపీ డేటా... 
ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక జీడీపీ గణాంకాలు ఈ నెల 30న (గురువారం) వెలువడతాయి. మార్కెట్‌ ముగిసిన తర్వాత ఈ గణాంకాలు వస్తాయి. జీఎస్‌టీ అమలు కారణంగా పలు సంస్థలు నిల్వలు తగ్గించుకున్న నేపథ్యంలో ఈ క్యూ1లో జీడీపీ 5.7 శాతంగా నమోదైంది. జీఎస్‌టీ అమలు కారణంగా వినియోగం వృద్ధి క్షీణించే అవకాశాలున్నాయని, అలాగే ప్రైవేట్‌ రంగ పెట్టుబడులు బలహీనంగా ఉండొచ్చని కోటక్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ టీనా వీర్మాణి పేర్కొన్నారు. అదే రోజు అక్టోబర్‌ నెల మౌలిక రంగ గణాంకాలు వస్తాయి. ఈ గణాంకాలు కూడా మార్కెట్‌ ముగిసిన తర్వాతనే వెలువడతాయి. ఇక ఈ నెల భారత తయారీ రంగ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌(పీఎంఐ) గణాంకాలు ఈ నెల 30(శుక్రవారం) ఉదయం 10.30కి వస్తాయి.  

ఎస్‌ అండ్‌ పీ రేటింగ్‌... ప్రతికూలమే.... 
దేశీయంగా ఫండమెంటల్స్‌ బావున్నాయని, ఎస్‌ అండ్‌ పీ రేటింగ్‌ను పెంచితే విదేశీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ మరింతగా మెరుగుపడి ఉండేదని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌  నాయర్‌ చెప్పారు. ఎస్‌ అండ్‌ పీ రేటింగ్‌ పెంచకపోవడంతో డాలర్‌తో రూపాయి మారకం బలహీనపడవచ్చని దీంతో ఈక్విటీ మార్కెట్‌ నీరసించవచ్చన్నారు. ఎస్‌అండ్‌ పీ రేటింగ్‌ పెంచకపోవడం నిరాశ కలిగించేదేనని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ హెడ్‌(ప్రైవేట్‌ క్లయింట్‌ గ్రూప్,  మార్కెట్‌ స్ట్రాటజీ) వి.కె. శర్మ అంగీకరించారు. అయితే ఇది మార్కెట్‌ జోరుపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చని పేర్కొన్నారు. 

స్తబ్దుగా మార్కెట్‌... 
ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయని, అయితే ఎన్నికల వేడి పెరుగుతోందని, మార్కెట్‌ ఒకింత స్తబ్దుగా ఉండే అవకాశాలున్నాయని శామ్‌కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమీత్‌ మోదీ చెప్పారు. ఆర్‌బీఐ పాలసీ, గుజరాత్, తదితర రాష్ట్రాల ఎన్నికలు,  అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్ల పెంపు తదితర ముఖ్యమైన అంశాలకు మార్కెట్‌ ప్రతిస్పందిస్తుందని, ఈ అంశాల ఆధారంగా మార్కెట్‌ గమనం ఉంటుందని, అప్పటిదాకా మార్కెట్‌ స్తబ్ధుగానే ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినా, ద్రవ్యోల్బణం దిగొచ్చినా, మార్కెట్‌ జోరు కొనసాగుతుందని పేర్కొన్నారు.  
గుజరాత్‌ ఫలితాలు కీలకం.. 

ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో ఎన్నికల ఫలితాలు మార్కెట్‌కు కీలకమని కోటక్‌ సెక్యూరిటీస్‌ విశ్లేషకులు సంజీవ్‌ జర్బాడే వ్యాఖ్యానించారు. గుజరాత్‌ ఫలితాలు అధికారపార్టీకి ప్రతికూలంగా ఉంటే,, మోదీ ప్రభ క్షీణిస్తోందని, 2019 ఎన్నికల్లో ఎన్‌డీఏ విజయావకాశాలు సన్నగిల్లుతాయనడానికి సంకేతం అవుతుందని వివరించారు. 

డయాబెటిస్‌  ఔషధం, రియోమెట్‌ను స్వచ్ఛందంగా రీకాల్‌ చేస్తున్న నేపథ్యంలో సోమవారం సన్‌ ఫార్మాపై ప్రతికూల ప్రభావం ఉండొచ్చు.  ఇక అంతర్జాతీయ అంశాల పరంగా చూస్తే, నవంబర్‌ నెల యూరోజోన్‌ ఎకనామిక్‌ సెంటిమెంట్‌ ఇండికేటర్‌ గణాంకాలు ఈ నెల 29న బుధవారం వెలువడతాయి. ఇక శుక్రవారం (వచ్చే నెల 1న) చైనా తయారీ రంగ పీఎంఐ గణాంకాలు వస్తాయి.  ఈ నెల విక్రయ గణాంకాలను ఈ శుక్రవారం వాహన కంపెనీలు వెల్లడిస్తాయి.

విదేశీ పెట్టుబడులు రూ.17,200 కోట్లు  
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) మన క్యాపిటల్‌ మార్కెట్లో ఈ నెలలో ఇప్పటివరకూ 260 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్‌ చేశారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఈక్విటీ మార్కెట్లో రూ.16,455 కోట్లు, డెట్‌ మార్కెట్లో రూ.754కోట్లు వెరశి మన క్యాపిటల్‌ మార్కెట్లో రూ.17,209 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు మూలధన బాండ్ల కేటాయింపులు, ప్రపంచ బ్యాంక్‌ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ జాబితాలో మన దేశం స్థానం మెరుగుపడటం, మూడీస్‌ సంస్థ సావరిన్‌ రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేయడంతో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు పెరిగిందని నిపుణులంటున్నారు. కాగా గత నెలలో మన క్యాపిటల్‌ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూ.19,000 కోట్లుగా ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement