Market Focus
-
జీడీపీ డేటాపై మార్కెట్ దృష్టి
న్యూఢిల్లీ: జీడీపీ, పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ)గణాంకాలు ఈ వారం మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులంటున్నారు. నవంబర్ సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్టులు ఈ వారంలోనే ముగియనున్నందున ఒడిదుడుకులు చోటు చేసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మూడీస్ సంస్థలా స్టాండర్డ్ అండ్ పూర్స్ సంస్థ మన రేటింగ్‌ను పెంచకపోవడం వారం ప్రారంభంలో ఒకింత ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. గత శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత ఎస్ అండ్ పీ రేటింగ్ ప్రకటన వెలువడింది. 30న జీడీపీ డేటా... ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక జీడీపీ గణాంకాలు ఈ నెల 30న (గురువారం) వెలువడతాయి. మార్కెట్ ముగిసిన తర్వాత ఈ గణాంకాలు వస్తాయి. జీఎస్టీ అమలు కారణంగా పలు సంస్థలు నిల్వలు తగ్గించుకున్న నేపథ్యంలో ఈ క్యూ1లో జీడీపీ 5.7 శాతంగా నమోదైంది. జీఎస్టీ అమలు కారణంగా వినియోగం వృద్ధి క్షీణించే అవకాశాలున్నాయని, అలాగే ప్రైవేట్ రంగ పెట్టుబడులు బలహీనంగా ఉండొచ్చని కోటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ టీనా వీర్మాణి పేర్కొన్నారు. అదే రోజు అక్టోబర్ నెల మౌలిక రంగ గణాంకాలు వస్తాయి. ఈ గణాంకాలు కూడా మార్కెట్ ముగిసిన తర్వాతనే వెలువడతాయి. ఇక ఈ నెల భారత తయారీ రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) గణాంకాలు ఈ నెల 30(శుక్రవారం) ఉదయం 10.30కి వస్తాయి. ఎస్ అండ్ పీ రేటింగ్... ప్రతికూలమే.... దేశీయంగా ఫండమెంటల్స్ బావున్నాయని, ఎస్ అండ్ పీ రేటింగ్‌ను పెంచితే విదేశీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మరింతగా మెరుగుపడి ఉండేదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఎస్ అండ్ పీ రేటింగ్ పెంచకపోవడంతో డాలర్‌తో రూపాయి మారకం బలహీనపడవచ్చని దీంతో ఈక్విటీ మార్కెట్ నీరసించవచ్చన్నారు. ఎస్అండ్ పీ రేటింగ్ పెంచకపోవడం నిరాశ కలిగించేదేనని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ హెడ్(ప్రైవేట్ క్లయింట్ గ్రూప్, మార్కెట్ స్ట్రాటజీ) వి.కె. శర్మ అంగీకరించారు. అయితే ఇది మార్కెట్ జోరుపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చని పేర్కొన్నారు. స్తబ్దుగా మార్కెట్... ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయని, అయితే ఎన్నికల వేడి పెరుగుతోందని, మార్కెట్ ఒకింత స్తబ్దుగా ఉండే అవకాశాలున్నాయని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోదీ చెప్పారు. ఆర్బీఐ పాలసీ, గుజరాత్, తదితర రాష్ట్రాల ఎన్నికలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు తదితర ముఖ్యమైన అంశాలకు మార్కెట్ ప్రతిస్పందిస్తుందని, ఈ అంశాల ఆధారంగా మార్కెట్ గమనం ఉంటుందని, అప్పటిదాకా మార్కెట్ స్తబ్ధుగానే ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినా, ద్రవ్యోల్బణం దిగొచ్చినా, మార్కెట్ జోరు కొనసాగుతుందని పేర్కొన్నారు. గుజరాత్ ఫలితాలు కీలకం.. ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్లో ఎన్నికల ఫలితాలు మార్కెట్‌కు కీలకమని కోటక్ సెక్యూరిటీస్ విశ్లేషకులు సంజీవ్ జర్బాడే వ్యాఖ్యానించారు. గుజరాత్ ఫలితాలు అధికారపార్టీకి ప్రతికూలంగా ఉంటే,, మోదీ ప్రభ క్షీణిస్తోందని, 2019 ఎన్నికల్లో ఎన్డీఏ విజయావకాశాలు సన్నగిల్లుతాయనడానికి సంకేతం అవుతుందని వివరించారు. డయాబెటిస్ ఔషధం, రియోమెట్ను స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్న నేపథ్యంలో సోమవారం సన్ ఫార్మాపై ప్రతికూల ప్రభావం ఉండొచ్చు. ఇక అంతర్జాతీయ అంశాల పరంగా చూస్తే, నవంబర్ నెల యూరోజోన్ ఎకనామిక్ సెంటిమెంట్ ఇండికేటర్ గణాంకాలు ఈ నెల 29న బుధవారం వెలువడతాయి. ఇక శుక్రవారం (వచ్చే నెల 1న) చైనా తయారీ రంగ పీఎంఐ గణాంకాలు వస్తాయి. ఈ నెల విక్రయ గణాంకాలను ఈ శుక్రవారం వాహన కంపెనీలు వెల్లడిస్తాయి. విదేశీ పెట్టుబడులు రూ.17,200 కోట్లు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) మన క్యాపిటల్ మార్కెట్లో ఈ నెలలో ఇప్పటివరకూ 260 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేశారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఈక్విటీ మార్కెట్లో రూ.16,455 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.754కోట్లు వెరశి మన క్యాపిటల్ మార్కెట్లో రూ.17,209 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు మూలధన బాండ్ల కేటాయింపులు, ప్రపంచ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జాబితాలో మన దేశం స్థానం మెరుగుపడటం, మూడీస్ సంస్థ సావరిన్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయడంతో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు పెరిగిందని నిపుణులంటున్నారు. కాగా గత నెలలో మన క్యాపిటల్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూ.19,000 కోట్లుగా ఉన్నాయి. -
గణాంకాలపై మార్కెట్ దృష్టి...
ఈ వారంలోనే జీడీపీ, ఐఐపీ, ద్రవ్యోల్బణం * ముడిచమురు, రూపాయి కదలికలూ కీలకమే... * మార్కెట్ గమనంపై నిపుణుల అంచనా.. న్యూఢిల్లీ: జీడీపీ, పారిశ్రామికోత్పత్తి, వినియోగదారుల ద్రవ్యోల్బణ గణాంకాలు.. ఈ వారం స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. ఎస్బీఐ, ఓఎన్జీసీ వంటి బ్లూచిప్ కంపెనీలు తమ క్యూ3 ఫలితాలను కూడా ఈ వారమే వెల్లడిస్తున్నాయి. భారత స్టాక్ మార్కెట్‌కు సంబంధించి ఈ వారం దేశీయ అంశాలే కీలకం కానున్నాయని, వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌పై ఇన్వెస్టర్లు బాగానే ఆశలు పెట్టుకుంటున్నారని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్ పోకడలు, ఈ వారంలో వెల్లడయ్యే కంపెనీల క్యూ3 ఫలితాలు, ముడిచమురు ధరల కదలికలు, రూపాయి విలువ హెచ్చుతగ్గులు కూడా స్టాక్ మార్కెట్‌పై ప్రభావంచూపుతాయని హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ చెప్పారు. ఈ వారంలో స్టాక్ మార్కెట్ సానుకూలంగానే చలించవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. దిగ్గజాల ఫలితాలు.. ఈ వారం పలు దిగ్గజ కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, గెయిల్, సిప్లా, కోల్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓఎన్జీసీ, హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్, భెల్, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్...తదితర కంపెనీలన్నీ ఈ వారంలోనే తమ క్యూ3 ఫలితాలను వెల్లడించనున్నాయి. కాగా శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత జనవరి నెల వినియోగదారుల ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడతాయి. మిడ్ క్యాప్ షేర్లపై దృష్టి.. సమీప భవిష్యత్‌లో స్టాక్ మార్కెట్ పోకడపై జీడీపీ గణాంకాలు ప్రభావం చూపుతాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ సింఘానియా పేర్కొన్నారు. రానున్న బడ్జెట్‌పై అంచనాలతో మిడ్-క్యాప్ షేర్లలో చురుగ్గా కదలికలు ఉండొచ్చని వివరించారు. నేడు(సోమవారం) వెలువడే జీడీపీ గణాంకాలు ఈ వారం స్టాక్ సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని జియోజిత్ బీఎన్పీ పారిబా హెడ్(టెక్నికల్ రీసెర్చ్ డెస్క్) ఆనంద్ జేమ్స్ చెప్పారు. చాంద్రమాన కొత్త సంవత్సరం సందర్భంగా ఈ వారమంతా చైనా మార్కెట్‌కు సెలవులని, ఈ కారణంగా మన మార్కెట్ గమనంపై అమెరికా స్టాక్ మార్కెట్ ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. ఇక ఇప్పటి నుంచి మార్కెట్ బడ్జెట్‌పై దృష్టిపెడుతుందని కోటక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్ హెడ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపేన్ షా అభిప్రాయపడ్డారు. గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 254 పాయింట్ల నష్టంతో 24,617 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 74 పాయింట్లు క్షీణించి 7,489 పాయింట్ల వద్ద ముగిశాయి. మళ్లీ విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఈ నెల మొదటి వారంలో విదేశీ ఇన్వెస్టర్లు భారత క్యాపిటల్ మార్కెట్లో రూ.2,500 కోట్లు పెట్టుబడులు పెట్టారు. వీటిల్లో ఎక్కువ భాగం డెట్ మార్కెట్లోకి వచ్చాయి. గతనెలలో క్యాపిటల్ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు భారీగా రూ.6,245 కోట్ల నికర నిధులు వెనక్కి తీసుకున్నారు. డిపాజిటరీలు వెల్లడించిన గణాంకాల ప్రకారం.., ఈ నెల 1 నుంచి 5 వ తేదీ వరకూ విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లో రూ.604 కోట్లు, డెట్ మార్కెట్లో రూ. 1,965 కోట్లు చొప్పున నికర పెట్టుబడులు పెట్టారు. జీఎస్టీ, దివాళా బిల్లు వంటి కీలక బిల్లులు ఈ బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదం పొందగలవని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆశాభావం వ్యక్తం చేయడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చిందని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. గత ఏడాది విదేశీ ఇన్వెస్టర్ల నికర పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్లో రూ.17,806 కోట్లుగా, బాండ్ మార్కెట్లో రూ.45,856 కోట్లుగా ఉన్నాయి.