గణాంకాలపై మార్కెట్ దృష్టి... | GDP, IIP, more Q3 earnings to set tone for markets | Sakshi
Sakshi News home page

గణాంకాలపై మార్కెట్ దృష్టి...

Published Mon, Feb 8 2016 1:46 AM | Last Updated on Sun, Sep 3 2017 5:08 PM

గణాంకాలపై మార్కెట్ దృష్టి...

గణాంకాలపై మార్కెట్ దృష్టి...

ఈ వారంలోనే జీడీపీ, ఐఐపీ, ద్రవ్యోల్బణం
* ముడిచమురు, రూపాయి కదలికలూ కీలకమే...
* మార్కెట్ గమనంపై నిపుణుల అంచనా..

న్యూఢిల్లీ: జీడీపీ, పారిశ్రామికోత్పత్తి, వినియోగదారుల ద్రవ్యోల్బణ గణాంకాలు.. ఈ వారం స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. ఎస్‌బీఐ, ఓఎన్‌జీసీ వంటి బ్లూచిప్ కంపెనీలు తమ క్యూ3 ఫలితాలను కూడా ఈ వారమే వెల్లడిస్తున్నాయి. భారత స్టాక్ మార్కెట్‌కు సంబంధించి ఈ వారం దేశీయ అంశాలే కీలకం కానున్నాయని,  వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌పై ఇన్వెస్టర్లు బాగానే ఆశలు పెట్టుకుంటున్నారని మార్కెట్ విశ్లేషకులంటున్నారు.

ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్ పోకడలు, ఈ వారంలో వెల్లడయ్యే కంపెనీల క్యూ3 ఫలితాలు, ముడిచమురు ధరల కదలికలు, రూపాయి విలువ హెచ్చుతగ్గులు కూడా స్టాక్ మార్కెట్‌పై ప్రభావంచూపుతాయని హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ చెప్పారు. ఈ వారంలో స్టాక్ మార్కెట్ సానుకూలంగానే చలించవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు.
 
దిగ్గజాల ఫలితాలు..
ఈ వారం పలు దిగ్గజ కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, గెయిల్, సిప్లా, కోల్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓఎన్‌జీసీ, హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్, భెల్, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్...తదితర కంపెనీలన్నీ ఈ వారంలోనే తమ క్యూ3 ఫలితాలను వెల్లడించనున్నాయి. కాగా శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత జనవరి నెల వినియోగదారుల ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడతాయి.
 
మిడ్ క్యాప్ షేర్లపై దృష్టి..
సమీప భవిష్యత్‌లో స్టాక్ మార్కెట్ పోకడపై జీడీపీ గణాంకాలు ప్రభావం చూపుతాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డెరైక్టర్ సింఘానియా పేర్కొన్నారు.  రానున్న బడ్జెట్‌పై అంచనాలతో మిడ్-క్యాప్ షేర్లలో చురుగ్గా కదలికలు ఉండొచ్చని వివరించారు.  నేడు(సోమవారం) వెలువడే జీడీపీ గణాంకాలు ఈ వారం స్టాక్ సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని జియోజిత్ బీఎన్‌పీ పారిబా హెడ్(టెక్నికల్ రీసెర్చ్ డెస్క్) ఆనంద్ జేమ్స్ చెప్పారు.

చాంద్రమాన కొత్త సంవత్సరం సందర్భంగా ఈ వారమంతా చైనా మార్కెట్‌కు సెలవులని, ఈ  కారణంగా మన మార్కెట్ గమనంపై అమెరికా స్టాక్ మార్కెట్ ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. ఇక ఇప్పటి నుంచి మార్కెట్ బడ్జెట్‌పై దృష్టిపెడుతుందని కోటక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్ హెడ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దీపేన్ షా అభిప్రాయపడ్డారు. గత వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 254 పాయింట్ల నష్టంతో 24,617 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 74 పాయింట్లు క్షీణించి 7,489 పాయింట్ల వద్ద ముగిశాయి.
 
మళ్లీ విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు
ఈ నెల మొదటి వారంలో విదేశీ ఇన్వెస్టర్లు భారత క్యాపిటల్ మార్కెట్లో రూ.2,500 కోట్లు పెట్టుబడులు పెట్టారు. వీటిల్లో ఎక్కువ భాగం డెట్ మార్కెట్లోకి వచ్చాయి. గతనెలలో క్యాపిటల్ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు భారీగా రూ.6,245 కోట్ల నికర నిధులు వెనక్కి తీసుకున్నారు. డిపాజిటరీలు వెల్లడించిన గణాంకాల ప్రకారం.., ఈ నెల 1 నుంచి 5 వ తేదీ వరకూ విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లో రూ.604 కోట్లు, డెట్ మార్కెట్లో రూ. 1,965 కోట్లు చొప్పున నికర పెట్టుబడులు పెట్టారు.

జీఎస్‌టీ, దివాళా బిల్లు వంటి కీలక బిల్లులు ఈ బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదం పొందగలవని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆశాభావం వ్యక్తం చేయడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చిందని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. గత ఏడాది విదేశీ ఇన్వెస్టర్ల నికర పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్లో రూ.17,806 కోట్లుగా, బాండ్ మార్కెట్లో రూ.45,856  కోట్లుగా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement