
గణాంకాలపై మార్కెట్ దృష్టి..
► భౌగోళిక అంశాలూ కీలకమే: విశ్లేషకుల అంచనా
► స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం సెలవు
► ట్రేడింగ్ నాలుగు రోజులే
ద్రవ్యోల్బణ గణాంకాలు, భౌగోళిక రాజకీయ అంశాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులంటున్నారు. వీటితో పాటు ప్రపంచ మార్కెట్ల పోకడ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల గమనం, ఈ వారంలో వెలువడే కంపెనీల క్యూ1 ఫలితాలు, రుతుపవనాల విస్తరణ ఈ వారం మన స్టాక్ సూచీల కదలికలను నిర్దేశిస్తాయని వారంటున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న(మంగళవారం) స్టాక్ మార్కెట్‌కు సెలవు. దీంతో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఈ వారంలో నాలుగు రోజులకు పరిమితం కానున్నది.
క్షీణించిన ఐఐపీ...
గత శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడిన జూన్ నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలకు(ఐఐపీ) సోమవారం మార్కెట్ ప్రతిస్పందిస్తుంది. తయారీ, క్యాపిటల్ గూడ్స్ రంగాలు క్షీణించడంతో జూన్‌లో పారిశ్రామికోత్పత్తి 0.1 శాతానికి క్షీణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామికోత్పత్తి క్షీణించడం ఇదే మొదటిసారి. జూలై నెల టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు నేడు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ జరుగుతున్నప్పుడే వెలువడతాయి. రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు నేడు మార్కెట్ ముగిసిన తర్వాత వస్తాయి. ఇక నేడు (సోమవారం–ఆగస్టు 14న) కోల్ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్, టాటా పవర్ కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి.
ఒత్తిడి కొనసాగుతుంది....
డొల్ల కంపెనీలంటూ మూడొందలకు పైగా కంపెనీలపై మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ ఆంక్షలు విధించడం దేశీయంగా ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. సెబీ చర్య సమీప భవిష్యత్తులో లిక్విడిటీపై ప్రభావం చూపనున్నదని ఆయన అభిప్రాయపడ్డారు.
అమెరికా–ఉత్తర కొరియాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం ఈ వారం మార్కెట్‌పై పడనున్నదని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ హెడ్(బిజినెస్, ప్రైవేట్ క్లయింట్ గ్రూప్) వి.కె. శర్మ పేర్కొన్నారు. అమెరికా, ఉత్తర కొరియాల మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో గ్లోబల్ ఫండ్స్ తమ పోర్ట్‌ఫోలియోలను రీబ్యాలన్స్ చేస్తాయని, ఫలితంగా మన మార్కెట్లపై కొన్ని రోజుల పాటు ఒత్తిడి ఉంటుందని ఈక్వినామిక్స్ రీసెర్చ్ వ్యవస్థాపకులు జి. చొక్కలింగమ్ పేర్కొన్నారు. కాగా గతవారంలో సెన్సెక్స్ 1,112 పాయింట్లు. నిఫ్టీ 356 పాయింట్లు నష్టపోయాయి.
డెట్‌లో జోరుగా విదేశీ పెట్టుబడులు
విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటిదాకా రూ.10 వేల కోట్లకు పైగా డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. కీలక రేట్లను ఆర్‌బీఐ తగ్గించడంతో ఈ స్థాయిలో విదేశీ పెట్టుబడులు వచ్చాయని, ఈ ఏడాది జూలైలో ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఎఫ్‌పీఐల పెట్టుబడుల పరిమితిని సెబీ పెంచడం కూడా విదేశీ పెట్టుబడుల జోరును పెంచిందని నిపుణులంటున్నారు. అయితే స్టాక్ వేల్యూయేషన్లు అధికంగా ఉండటంతో ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.2,000 కోట్ల మేర పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ డెట్‌లో విదేశీ పెట్టుబడులు రూ.1.24 లక్షల కోట్లకు పెరిగాయి.