మార్కెట్ అప్రమత్తం
98 పాయింట్ల నష్టంతో 28,902కు సెన్సెక్స్
23 పాయింట్ల నష్టంతో 8,924కు నిఫ్టీ
అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తతను కొనసాగించడంతో బుధవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. దీనికి బలహీనంగా ఉన్న అంతర్జాతీయ సంకేతాలు తోడవడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్98 పాయింట్లు నష్టపోయి 28,902 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 23 పాయింట్లు నష్టపోయి 8,924 పాయింట్ల వద్ద ముగిశాయి. లోహ, రియల్టీ, ఆయిల్, గ్యాస్, పీఎస్‌యూ షేర్లు నష్టపోయాయి.
ఇంట్రాడేలో 184 పాయింట్ల నష్టం
ఎగ్జిట్ పోల్ ఫలితాలు నేడు సాయంత్రం వస్తాయి. తుది ఫలితాలు శనివారం(ఈ నెల 11న) వెలువడతాయి. వరుసగా రెండు రోజుల పాటు అమెరికా స్టాక్ సూచీలు నష్టపోవడం, చైనా వాణిజ్య లోటు గణాంకాలు అంతర్జాతీయ వృద్ధిపై తాజాగా ఆందోళనలు రేకెత్తించడం... తదితర బలహీన అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూల ప్రభావం చూపాయి. ఫెడ్ రేట్ల పెంపు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి నేపధ్యంలో మార్కెట్లో అప్రమత్తత పెరుగుతోందని జియజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ (రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. శుక్రవారం వెలువడే ఉద్యోగ గణాంకాలతో రేట్ల పెంపుపై మరింత స్పష్టత వస్తుందని వివరించారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 184 పాయింట్లు నష్టపోయింది.
కొనసాగిన లోష షేర్ల నష్టాలు...
లోహ షేర్ల నష్టాలు కొనసాగాయి. టాటా స్టీల్, నాల్కో, ఎన్‌ఎండీసీ, వేదాంత, జిందాల్ స్టీల్ అండ్ పవర్ 2–4 శాతం రేంజ్‌లో పడిపోయాయి.