
మారుతీ కొత్త బాలెనో వచ్చింది..
మారుతీ సుజుకీ కంపెనీ ప్రీమియం హ్యాచ్‌బాక్ సెగ్మెంట్లో కొత్త మోడల్‌ను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది.
* పెట్రోల్ వేరియంట్ ధరలు రూ.4.99 - రూ.7.01 లక్షల రేంజ్‌లో
* డీజిల్ కార్ల ధరలు రూ.6.16 - రూ.8.11 లక్షల రేంజ్‌లో
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ ప్రీమియం హ్యాచ్‌బాక్ సెగ్మెంట్లో కొత్త మోడల్‌ను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. బాలెనో పేరుతో ఈ మోడల్‌ను పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో అందిస్తున్నామని మారుతీ సుజుకీ తెలిపింది. ప్రీమియం కార్ల కోసం ఏర్పాటు చేసిన నెక్సా షోరూమ్స్ నెట్‌వర్క్ ద్వారా ఈ కారును విక్రయిస్తామని కంపెనీ ఎండీ, సీఈఓ కెనిచి అయుకవ చెప్పారు.
1.2 లీటర్ వీవీటీ పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన వేరియంట్ ధరలు రూ.4.99 లక్షల నుంచి రూ.7.01 లక్షల రేంజ్‌లో, 1.3 లీటర్ డీడీఐఎస్ డీజిల్ ఇంజిన్ వేరియంట్ ధరలు రూ.6.16 లక్షల నుంచి రూ.8.11 లక్షల రేంజ్(అన్ని ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)లో ఉన్నాయని పేర్కొన్నారు. పెట్రోల్ వేరియంట్ 21.4 కిమీ మైలేజీని, డీజిల్ వేరియంట్ 27.3 కిమీ. మైలేజీని ఇస్తుందని వివరించారు. డీజిల్, పెట్రోల్ రెండు వేరియంట్లలో సిగ్మా, డెల్టా, జెటా, ఆల్ఫా... నాలుగు ట్రిమ్‌ల్లో, ఏడు రంగుల్లో ఈ కారు లభిస్తుందని పేర్కొన్నారు.
జపాన్‌కు ఎగుమతి: భారత్‌ను మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లను దృష్టిలో పెట్టుకొని ఈ మోడల్‌ను తెస్తున్నామని కెనిచి చెప్పారు. భారత్‌లో మాత్రమే తయారయ్యే ఈ కారును జపాన్‌కు ఎగుమతి చేస్తామని, మారుతీ చరిత్రలో ఇది కొత్త అధ్యాయమని పేర్కొన్నారు. 2020 కల్లా ఏడాదికి 20 లక్షల కార్ల విక్రయ లక్ష్యాన్ని సాధించడానికి ఇదొక ముఖ్యమైన మోడల్ కాబోతోందని వివరించారు. యాపిల్ కంపెనీ అందించే యాపిల్ కార్‌ప్లే ఎంటర్‌టైన్మెంట్ సిస్టమ్‌ను ఈ కారులో(హై ఎండ్ మోడల్‌లో) పొందుపరిచామని కంపెనీ ఈడీ(మార్కెటింగ్, సేల్స్) ఆర్.ఎస్.కల్సి చెప్పారు.
యాపిల్ కార్ ప్లేను అందిస్తున్న తొలి భారత కంపెనీ ఇదేనని పేర్కొన్నారు. మారుతీ సుజుకీ అందిస్తోన్న ఈ తొలి ప్రీమియం హ్యాచ్‌బాక్ కారు హ్యుందాయ్ ఐ20, హోండా జాజ్, ఫోక్స్‌వ్యాగన్ పోలో కార్లకు గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ఈ కార్ల ధరలు రూ.5.34 లక్షల నుంచి రూ.8.63 లక్షల రేంజ్‌లో ఉన్నాయి. మొత్తం దేశీయ ప్రయాణికుల కార్ల మార్కెట్లో ప్రీమియం హ్యాచ్‌బాక్ కార్ల వాటా 20 శాతంగా ఉంటుందని అంచనా.