దేశీయ అతిపెద్ద కారు తయారీదారి మారుతీ సుజుకీ విశ్లేషకుల అంచనాలను మిస్ చేసింది. అయినప్పటికీ నేడు ప్రకటించిన క్యూ4 ఫలితాల్లో కంపెనీ నికర లాభాలు 10శాతం పైకి ఎగిశాయి. ఈ క్వార్టర్‌లో కంపెనీ లాభాలు రూ.1,882 కోట్లగా నమోదయ్యాయి. విశ్లేషకుల ప్రకారం మారుతీ సుజుకీ రూ.2,087 కోట్ల లాభాలను నమోదు చేస్తుందని అంచనాలు వెలువడ్డాయి. కానీ అంచనాల కంటే కాస్త తక్కువగా లాభాలను మారుతీ సుజుకీ ప్రకటించింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో కంపెనీ లాభాలు రూ.1,710.50 కోట్లగా ఉన్నాయి. మొత్తం ఆదాయం ఈ క్వార్టర్‌లో 2 శాతం పెరిగి రూ.21,760.60 కోట్లగా ఉంది. ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీ 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో షేరుపై రూ.80 డివిడెండ్ ప్రకటించింది.
ఎక్కువ పన్ను రేటు తమ క్యూ4 ప్యాట్ గణాంకాలపై ప్రభావం చూపిందని, అంతేకాక మెటల్ వ్యయాలు కూడా ఈ ఏడాది రూ.700 కోట్లు పెరగడంతో లాభాలు కాస్త తగ్గినట్టు పేర్కొంది. తమ పాపులర్ కారుగా ‘మారుతీ 800’ ఉన్నట్టు కంపెనీ ప్రకటించింది. మొత్తంగా జనవరి-మార్చి క్వార్టర్‌లో కంపెనీ 4,61,773 వాహనాలు విక్రయించినట్టు మారుతీ సుజుకీ తెలిపింది. గతేడాది ఇదే క్వార్టర్ కంటే ఇవి 11.4 శాతం పెంపుగా వెల్లడించింది. దేశీయ మార్కెట్‌లో 4,27,082 యూనిట్లను విక్రయించినట్టు, విదేశాలకు 34,691 యూనిట్లు ఎగుమతి చేసినట్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment