టాప్‌గేర్‌లో మారుతీ...
క్యూ4లో లాభం 61 శాతం జంప్; రూ.1,284 కోట్లు
- రికార్డు స్థాయిలో వార్షిక లాభం; రూ.3,711 కోట్లు
- 500%(రూ.25) డివిడెండ్ ప్రకటన
న్యూఢిల్లీ: దేశీ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ.. బంపర్ ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2014-15, క్యూ4)లో కంపెనీ నికర లాభం రూ.1,284 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.800 కోట్లతో పోలిస్తే 60.5 శాతం దూసుకెళ్లింది.
ఇక మొత్తం ఆదాయం కూడా 12.3 శాతం ఎగబాకి రూ.11,818 కోట్ల నుంచి రూ.13,273 కోట్లకు పెరిగింది. ప్రధానంగా అమ్మకాల జోరుతో పాటు ఉత్పాదక వ్యయం తగ్గడం, కమోడిటీ ధరల తగ్గుదల వంటివి భారీ లాభాలకు దోహదం చేశాయని కంపెనీ చైర్మన్ ఆర్‌సీ భార్గవ వ్యాఖ్యానించారు. విదేశీ మారకం(ఫారెక్స్) రేటు సానుకూలత కారణంగా రాయల్టీ రేటు కూడా తగ్గినట్లు ఆయన పేర్కొన్నారు. 2014-15 ఏడాదికి మాతృ సంస్థ సుజుకీకి మారుతీ రూ.2,788 కోట్ల రాయల్టీని చెల్లించింది.
మొత్తం ఆదాయాల్లో ఇది 5.7 శాతం కింద లెక్క. అంతక్రితం ఏడాది రాయల్టీ రూ.2,604 కోట్లు(6.1 శాతం)గా నమోదైంది. మెరుగైన పనితీరు నేపథ్యంలో కంపెనీ బోర్డు గతేడాదికి రూ. 5 ముఖ విలువగల ఒక్కో షేరుపై రూ.25 చొప్పున(500 శాతం) డివిడెండ్‌ను ప్రతిపాదించింది. 2013-14లో డివిడెండ్ రూ.12(240 శాతం) మాత్రమే.
పూర్తి ఏడాదికి జూమ్...
2014-15 పూర్తి ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 33.3 శాతం వృద్ధితో రూ.3,711 కోట్లకు ఎగసింది. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక వార్షిక లాభం కావడం విశేషం. 2013-14 ఏడాదిలో లాభం రూ.2,783 కోట్లు(ఇప్పటిదాకా ఇదే అత్యధికం)గా నమోదైంది. ఇక మొత్తం వార్షిక ఆదాయం కూడా రికార్డు స్థాయిలోనే రూ.48,606 కోట్లకు దూసుకెళ్లింది. 2013-14లో ఆదాయం రూ.42,645 కోట్లతో పోలిస్తే 14 శాతం వృద్ధి నమోదైంది.
అమ్మకాల జోష్...
గడిచిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ చరిత్రలో అత్యధిక స్థాయి వార్షిక అమ్మకాలను నమోదు చేసింది. 11.9 శాతం వృద్ధితో మొత్తం 12,92,415 వాహనాలను విక్రయించింది. ఇందులో 1,21,713 వాహనాలు ఎగుమతి(20 శాతం అప్) అయినట్లు కంపెనీ వివరించింది. క్యూ4లో అమ్మకాలు 6.7 శాతం వృద్ధితో 3,46,712కి చేరాయి. ఇక ప్రస్తుత 2015-16 ఏడాదికి 10-11 శాతం అమ్మకాల వృద్ధి ఉండొచ్చని కంపెనీ అంచనా వేస్తోంది.
గుజరాత్‌లో నెలకొల్పుతున్న ప్లాంట్ పనులు చురుగ్గా జరుగుతున్నాయని భార్గవ చెప్పారు. మాతృ సంస్థ సుజుకీకి పూర్తిగా దీన్ని అప్పగించాలని మారుతీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి వాటాదారుల అనుమతి తీసుకోవడానికి ఎలాంటి సమస్యా లేదని.. అయితే, కంపెనీల చట్టంలో సవరణలకు పార్లమెంటు ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ ఏడాది రూ.4,000 కోట్ల పెట్టుబడి...
మార్కెట్లో తన అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా ఈ ఏడాది(2015-16)లో రూ.4,000 కోట్ల మొత్తాన్ని పెట్టుబడిగా వెచ్చించనున్నట్లు మారుతీ తెలిపింది. ఆర్‌అండ్‌డీ, మార్కెటింగ్ ఇన్‌ఫ్రా తదితర విభాగాల్లో ఈ నిధులను ఖర్చు చేయనుంది.
ఆకర్షణీయమైన ఫలితాల నేపథ్యంలో మారుతీ షేరు ధర సోమవారం బీఎస్‌ఈలో 3 శాతం దూసుకెళ్లి రూ.3,647 వద్ద స్థిరపడింది.