న్యూఢిల్లీ: ఆర్థిక సంవత్సరం చివరి నెల మార్చిలో వాహన సంస్థలు మంచి విక్రయాలను నమోదు చేశాయి. కార్ల మార్కెట్‌లో లీడర్‌గా ఉన్న మారుతీ ఏకంగా 1,60,598 వాహనాలను విక్రయించింది. అంతకుముందు ఏడాది ఇదే నెలలో నమోదైన విక్రయాలతో పోలిస్తే 15% వృద్ధి సాధించింది. 2017 ఏడాది మార్చిలో మారుతీ అమ్మకాలు 1,39,763 యూనిట్లుగా ఉన్నాయి. దేశీయంగా అమ్మకాలు 16 శాతం వృద్ధితో 1,48,582 గా నమోదయ్యాయి. ఎగుమతుల్లో వృద్ధి 2.1 శాతంగా ఉంది.
టాటా మోటార్స్ 35 శాతం వృద్ధి
టాటా మోటార్స్ సైతం మార్చి నెలలో విక్రయాల పరంగా 35 శాతం వృద్ధిని నమోదు చేసింది. 69,440 వాహనాలను విక్రయించింది. దేశీయంగా మొత్తం వాహనాలు 2017–18 ఆర్థిక సంవత్సరంలో చూసుకుంటే 23 శాతం వృద్ధితో 5,86,639గా నమోదయ్యాయి. మార్చి నెలలో వాణిజ్య వాహనాలు 37 శాతం వృద్ధితో 49,174 యూనిట్లుగా ఉన్నాయి. ప్రయాణికుల వాహనాలు 31 శాతం పెరిగి 20,266 యూనిట్లు అమ్ముడయ్యాయి.
అమ్మకాల్లో ‘హీరో’
ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటో అమ్మకాల్లోనూ హీరో అనిపించుకుంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 75 లక్షల వాహనాలను విక్రయించి ఈ మైలురాయిని చేరిన తొలి కంపెనీగా నిలిచింది. అంతర్జాతీయంగా ఈ ఘనత సాధించిన కంపెనీ తమదేనని హీరో మోటో కార్ప్ తెలిపింది.
అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2016–17)లో అమ్మకాలు 66.6 లక్షలుగా ఉన్నాయి. 2020 నాటికి కోటి వాహనాల విక్రయ లక్ష్యం దిశగా పయనిస్తున్నామని.. ఇందులో భాగంగా ఈ ఏడాదిలో 4 కొత్త మోడళ్లు ఎక్స్‌ట్రీమ్ 200ఆర్, ఎక్స్‌పల్స్, డ్యుయెట్ 125, మాస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్లను ఆవిష్కరించనున్నట్టు పేర్కొంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాల్లో 27 శాతం వృద్ధి
ఐచర్ మోటార్స్‌కు చెందిన ద్విచక్ర వాహన కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ సైతం మార్చి మాసంలో అమ్మకాల్లో 27 శాతం వృద్ధిని నమోదు చేసింది. 76,087 వాహనాలు అమ్ముడుపోయాయి. 2017 మార్చిలో అమ్మకాలు 60,113 యూనిట్లు కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment