భారత్‌తో పన్ను సమాచార మార్పిడి
న్యూఢిల్లీ: పన్ను సంబంధ సమాచారాన్ని భారత్‌తో ఆటోమాటిగ్గా మార్పిడి చేసుకోవాలని నిర్ణయించినట్లు మారిషస్ ప్రధాని నవీన్ రామ్‌గులాం తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీతో మంగళవారం న్యూఢిల్లీలో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మనీ లాండరింగ్ వంటి అక్రమాలను తమ ప్రభుత్వం అనుమతించబోదని స్పష్టం చేశారు.
ఇరుదేశాల మధ్య ప్రత్యక్ష పన్ను నివారణ ఒప్పందానికి సంబంధించిన అన్ని అంశాల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాల్సి ఉందని అన్నారు. పన్ను ఒప్పందానికి సవరణల ప్రతిపాదన దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉందని చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయని అన్నారు. తమ ఆలోచనలను సమర్థంగా అమలు చేయడానికి మోడీ, తాను ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. మారిషస్ పర్యటనకు రావాల్సిందిగా మోడీని ఆహ్వానించినట్లు తెలిపారు.