ఆన్‌లైన్‌లో మెడ్‌ప్లస్ క్లినికల్ ల్యాబ్ సేవలు | Medplas online Clinical Lab Services | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో మెడ్‌ప్లస్ క్లినికల్ ల్యాబ్ సేవలు

Published Fri, Dec 11 2015 12:02 AM | Last Updated on Sun, Sep 3 2017 1:47 PM

ఆన్‌లైన్‌లో మెడ్‌ప్లస్ క్లినికల్ ల్యాబ్ సేవలు

ఆన్‌లైన్‌లో మెడ్‌ప్లస్ క్లినికల్ ల్యాబ్ సేవలు

మార్కెట్ రేట్ల కంటే 50% తక్కువకే
మెడ్‌ప్లస్ ఫౌండర్ మధుకర్ గంగాడి
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
ఫార్మసీ రిటైల్ చైన్ మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్ తాజాగా క్లినికల్ ల్యాబొరేటరీ సేవలను ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చింది. ఇందుకోసం మెడ్‌ప్లస్‌ల్యాబ్.కామ్ పోర్టల్‌ను గురువారం ప్రారంభించింది. రోగ నిర్ణయ పరీక్షల కోసం రోగులు ల్యాబ్‌కు వెళ్లే అవసరం లేదు. ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసుకుంటే చాలు. కస్టమర్ కోరిన సమయంలోనే ల్యాబ్ సహాయకులు ఇంటికి వచ్చి శాంపిల్స్‌ను (నమూనా) సేకరిస్తారు. రిపోర్టులను ఇంటికి పంపుతారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో అత్యాధునిక ల్యాబొరేటరీతోపాటు 15 శాంపిల్ సేకరణ కేంద్రాలను కంపెనీ ఏర్పాటు చేసింది. మార్కెట్ రేట్ల కంటే 50 శాతం తక్కువకే సేవలు పొందవచ్చని కంపెనీ వెల్లడించింది. పరీక్షల వివరాలు తెలియనివారు ప్రిస్క్రిప్షన్‌ను అప్‌లోడ్ చేయవచ్చు. అలాగే రోగులు తమ ఆరోగ్య సంబంధ సమాచారాన్ని (రికార్డులు) వెబ్‌సైట్‌లో పొందుపర్చుకోవచ్చు.

 ఇతర నగరాలకూ..
 కొద్ది రోజుల్లో టాప్-10 నగరాల కు మెడ్‌ప్లస్‌ల్యాబ్.కామ్ సేవలను విస్తరిస్తామని మెడ్‌ప్లస్ ఫౌండర్ మధుకర్ గంగాడి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ల్యాబ్‌తోపాటు కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం రూ.10 కోట్లు కేటాయించామని, విస్తరణకు తగ్గట్టుగా ఈ మొత్తాన్ని పెంచుతామన్నారు. ‘భారత్‌లో రోగ నిర్ణయ పరీక్షల (డయాగ్నోస్టిక్) వ్యాపార పరిమాణం 18 శాతం వార్షిక వృద్ధితో రూ.14,500 కోట్లుంది. ఇందులో పాథాలజీ వాటా 70 శాతం, రేడియాలజీ, ఇమేజింగ్ 30 శాతం కైవసం చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా 1 లక్షలకుపైగా ల్యాబ్‌లు ఉన్నాయి. వీటిలో 85 శాతం అవ్యవస్థీకృత రంగంలో ఉన్నాయి’ అని వెల్లడించారు. ప్రస్తుతం బ్లడ్, బాడీ ఫ్లూయిడ్ పరీక్షలు మాత్రమే చేస్తారు. రానున్న రోజుల్లో రేడి యాలజీ, స్కానింగ్ సేవలను జోడిస్తామని కంపెనీ సీవోవో సురేంద్ర మంతెన తెలిపారు.

 పెరగనున్న ఆన్‌లైన్ వాటా..
 మెడ్‌ప్లస్‌కు దేశవ్యాప్తంగా 1,300 ఫార్మసీలు ఉన్నాయి. మార్చికల్లా మరో 60 ఏర్పాటు చేయనున్నారు. టర్నోవర్ 2014-15లో రూ.1,350 కోట్లు నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,800 కోట్లు ఆశిస్తోంది. టర్నోవర్‌లో 10 శాతం ఉన్న ఆన్‌లైన్ వాటా మార్చి నాటికి 15-20 శాతానికి చేరొచ్చని మధుకర్ తెలిపారు. ప్రతి నెల ఆన్‌లైన్ అమ్మకాలు 30 శాతం వృద్ధి చెందుతున్నాయని చెప్పారు. సుమారు రూ.330 కోట్ల నిధుల సమీకరణను కొద్ది రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. కాగా, మెడ్‌ప్లస్‌లో మధుకర్‌కు 20 శాతం వాటా ఉంది. పీఈ కంపెనీలైన మౌంట్ కెల్లెట్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్, టీవీఎస్ క్యాపిటల్, ఇండియా వెంచర్ అడ్వైజర్స్‌కు 69 శాతం, మిగిలినది ప్రమోటర్ బంధువులు, స్నేహితులు, ఉద్యోగులకు ఉంది. పీఈ కంపెనీల వాటాతోపాటు ఇతర వాటాదారుల నుంచి 6 శాతం వాటాను రెండు పీఈ సంస్థలు ఒకట్రెండు నెలల్లో చేజిక్కించుకోనున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement