సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో వైద్య రంగంలోనూ ఐటీ సేవలు అగ్రభాగాన నిలుస్తున్నాయి. ఒక్క క్లిక్‌తో కావాల్సిన సరుకులనే కాదు.. అవసరమైన వైద్య సేవలను పొందే విషయంలోనూ మహానగర సిటీజన్లు ముందుండడం విశేషం. స్మార్ట్ సాంకేతికత వినియోగంలో ముందున్న నగరవాసులు.. వైద్యసేవల రంగంలోనూ ఆధునిక సాంకేతికత వినియోగానికి మొగ్గు చూపుతున్నారు. రోగుల అవసరాలకు తగినట్లుగా మహానగరం పరిధిలోని పలు కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు, వైద్య పరీక్షల నిర్వహణ సంస్థలు ఆయా సేవలను ఆన్‌లైన్ ఆధారంగా అందజేస్తుండడం విశేషం.
చదవండి: కేంద్రం వద్దంటే నువ్వేం చేస్తున్నట్లు..?
ఈ విషయంలో గ్రేటర్‌సిటీ దేశంలో నాలుగో స్థానంలో నిలిచినట్లు నాస్కామ్ (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్) తాజా అధ్యయనంలో తేలింది. ఈ విషయంలో దేశరాజధాని ఢిల్లీ తొలిస్థానంలో రెండోస్థానంలో ముంబై.. మూడో స్థానంలో బెంగళూరు.. నాలుగో స్థానంలో హైదరాబాద్ నిలిచినట్లు తాజా నివేదికలో పేర్కొనడం విశేషం. ప్రధానంగా వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు సంబంధించిన ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల నిర్వహణ, టెలీమెడిసిన్ సేవలు, వెబ్ ఆధారిత డయాగ్నొస్టిక్ సేవల్లో సాంకేతికత వినియోగం పెరిగినట్లు ఈ సంస్థ అధ్యయనంలో తెలిపింది. దేశంలో ఇలాంటి సేవలు అందించే 320 సంస్థలుండగా.. గ్రేటర్ పరిధిలో వీటి సంఖ్య 50కిపైమాటేనని నాస్కామ్ అంచనా వేసింది.
చదవండి: తెలంగాణలో తృణమూల్ కాంగ్రెస్!
ఐటీ.. హై హై..
వైద్యసేవల రంగంలో సేవలందిస్తున్న పలు సంస్థలు కృత్రిమ మేధస్సు (ఏఐ), బిగ్ డేటా అనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్‌థింగ్స్ (ఐఓటీ) అనువర్తనాలను వినియోగించడం ద్వారా రోగులకు వివిధ రకాల వైద్య, డయాగ్నొస్టిక్, డాక్టర్ కన్సల్టేషన్ సేవలందిస్తున్నట్లు నాస్కామ్ తెలిపింది. ప్రధానంగా వివిధ రకాల స్పెషలిస్ట్ వైద్యులను కలిసేందుకు గ్రేటర్ సిటీజన్లు ఒక్క మౌస్‌క్లిక్‌తో వివిధ ఆన్‌లైన్ పోర్టళ్లను ఆశ్రయించి.. అందులోనూ వైద్యనిపుణులకు సంబంధించిన ఫీడ్‌బ్యాక్‌ను పరిశీలించిన తర్వాతే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుంటున్నట్లు పేర్కొంది. కాల్‌హెల్త్ వంటి సంస్థలు రోగుల ఇళ్ల వద్దనే రక్త,మూత్ర,తెమడ నమూనాలను సేకరించి.. ఆన్‌లైన్‌లో వైద్యపరీక్షల ఫలితాలను ఇటు వైద్యులకు అటు రోగులకు సకాలంలో చేరవేస్తోందని ఉదాహరించింది.
సాంకేతికతపైనే ఆధారం..
పలు ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో కొన్నిసార్లు రోగుల నిష్పత్తి ఆధారంగా బెడ్లు సరిపోకపోవడం, వైద్యులు అందుబాటులో లేకపోవడంతో టెలీమెడిసిన్ సేవలు అవసరమవుతున్నాయి. నాణ్యమైన వైద్య సేవలు పొందేందుకు రోగులు,సిటీజన్లు హెల్త్‌కేర్ ఐటీ పోర్టళ్లు,సైట్లను ఆశ్రయిస్తున్నారు. ప్రముఖ, నిపుణులైన వైద్యుల కన్సల్టేషన్‌కు ఈ సాంకేతిక ఉపకరిస్తోంది. రోగులు, వినియోగదారులు తమ బడ్జెట్‌లోనే వివిధ రకాల శస్త్రచికిత్సలు, వైద్యసేవలు ఎలా పొందాలని క్షణాల్లో తెలుసుకునేందుకు పలు మొబైల్ యాప్‌లు, ఆన్‌లైన్ పోర్టళ్లు అందుబాటులోకి వచ్చాయి.
హెల్త్‌కేర్ రంగంలో ఐటీ,సాంకేతికత వినియోగం ఆధారంగా సేవలందించే సంస్థల వ్యాపారం దేశవ్యాప్తంగా 2016లో 70 మిలియన్ డాలర్లు కాగా.. 2021 చివరి నాటికి 160 మిలియన్ అమెరికా డాలర్లకు చేరుకుందని నాస్కామ్ అంచనా వేసింది. రోగులకు సంబంధించిన వివరాలను భద్రపరచడం,వారు కోరిన వైద్య సేవలను సకాలంలో అందించేందుకు హెల్త్‌కేర్ ప్రిడిక్టివ్ ఎనలైటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ సొల్యూషన్స్ అనే సాంకేతికతను వినియోగిస్తున్నారు.
ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ సమర్థవంతమైన సమాచార నిర్వహణ, సమాచార వ్యాప్తికి ఐటీ సాంకేతికత దోహదం చేస్తోంది. ప్రైవేటు ఆసుపత్రులతో పాటు, పబ్లిక్ హెల్త్‌కేర్ వ్యవస్థలో రోగుల సంరక్షణకు ఐటీని దత్తత చేసుకోవడం అనివార్యమైందని నాస్కామ్ పేర్కొంది. ఈ ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానా న్ని ఉపయోగించుకునే విషయంలో పలు కార్పొరేట్ ఆస్పత్రులు, సంస్థలు వైద్యులకు శిక్షణ కార్యక్రమాలను సైతం అందజేస్తున్నాయని నాస్కామ్ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment