సాక్షి, హైదరాబాద్: క్యాబ్‌లో కాసింత ప్రశాంతంగా ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే మీ జేబులో నగదు ఉందో లేదో చూసుకొని మరీ క్యాబ్ బుక్ చేసుకోండి. గూగుల్ పే నుంచి, పేటీఎం వంటి యూపీఐ సేవల నుంచి చార్జీలు చెల్లించవచ్చనుకుంటే క్యాబ్ లభించడం కష్టమే. ఆన్‌లైన్ పేమెంట్‌లపై సేవలను అందజేసేందుకు నగరంలో క్యాబ్ డ్రైవర్‌లు నిరాకరిస్తున్నారు. క్యాబ్ బుక్ చేసుకున్న వెంటనే చార్జీల చెల్లింపులపై ఆరా తీస్తున్నారు. నగదు రూపంలోనే చెల్లించనున్నట్లు ప్రయాణికులు భరోసా ఇస్తేనే క్యాబ్‌లు వస్తున్నాయి. లేదంటే ఉన్నపళంగా రైడ్స్ రద్దవుతున్నాయి. కొంతమంది ఆటోడ్రైవర్లు సైతం అదే బాటలో నడుస్తున్నారు.
చివరి నిమిషంలో రైడ్స్ రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉబెర్, ఓలా తదితర సంస్థలకు చెందిన క్యాబ్‌లు, ఆటోలు ప్రయాణికులకు పట్టపగలు చుక్కలు చూపిస్తున్నాయి. ఆర్టీఏ అధికారులు, పోలీసులు క్యాబ్‌ల నిర్వహణపై దృష్టి సారించకపోవడంతో కొంతమంది డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మోటారు వాహన నిబంధనల ప్రకారం ప్రయాణికులు నమోదు చేసుకున్న రైడ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయడానికి వీల్లేదు. అలాంటి రైడ్స్ రద్దును పోలీసులు, రవాణా అధికారులు తీవ్రంగా పరిగణించి రూ.500 వరకు జరిమానా విధించవచ్చు, కానీ ఈ నిబంధన ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. గ్రేటర్ హైదరాబాద్‌లో వివిధ రకాల కారణాలతో డ్రైవర్లు ప్రతి పది రైడ్‌లలో 3 నుంచి 4 రైడ్‌లను రద్దు చేయడం గమనార్హం.
డ్రైరన్‌ల నెపంతో రద్దు..
మరోవైపు డ్రై రన్ సాకుతో కొందరు డ్రైవర్‌లు రైడ్‌లను రద్దు చేస్తున్నారు. ప్రయాణికులు క్యాబ్ బుక్ చేసుకొన్న సమయానికి కనీసం 3 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో ఉంటే క్యాబ్‌లు, ఆటోలు ఠంచన్‌గా బుక్ అవుతున్నాయి. అంతకంటే ఎక్కువ దూరంలో ఉంటే మాత్రం వెంటనే రద్దవుతున్నాయి. దీంతో ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ‘మహిళలు, పిల్లలతో కలిసి ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఇలాంటి ఆకస్మిక రద్దులతో చాలా ఇబ్బందిగా ఉంటోంది. క్యాబ్‌లను నమ్ముకొని ప్రయాణం చేయడం కష్టమనిపిస్తుంది.’ అని మారేడుపల్లికి చెందిన సుధీర్ విస్మయం వ్యక్తం చేశారు.
ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో రైడ్‌ల రద్దు ఎక్కువగా ఉంటోంది. ‘పెళ్లిళ్లు, పుట్టిన రోజు వంటి వేడుకల్లో పాల్గొనేందుకు క్యాబ్‌లను నమ్ముకొని నగర శివార్లలోని ఫంక్షన్ హాళ్లకు వెళ్తే తిరిగి ఇల్లు చేరుకోవడం కష్టమే’నని ఎల్‌బీనగర్‌కు చెందిన నవీన్ చెప్పారు. ప్రయాణికులు క్యాబ్ బుక్ చేసుకున్న తరువాత 5 కిలోమీటర్‌ల కంటే ఎక్కువ దూరంలో ఉండే డ్రైవర్‌లు వెంటనే రైడ్ రద్దు చేస్తున్నారు. మరోవైపు దూరాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా కొందరు ఆకస్మిక రద్దుకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గిట్టుబాటు కావడం లేదు
డ్రై రన్‌లలో డ్రైవర్లు ఎక్కువ దూరం ఖాళీగా వెళ్లాల్సి ఉంటుంది. పెరిగిన డీజిల్ ధరల దృష్ట్యా ఇది ఎంతో భారం. ఓలా, ఉబెర్ సంస్థలు ఇచ్చే కమీషన్లు గిట్టుబాటు కావడం లేదు. ఆన్‌లైన్ చెల్లింపుల్లో సదరు క్యాబ్ అగ్రిగేటర్‌ల ఖాతాల్లోంచి డ్రైవర్ ఖాతాలోకి జమ కావడానికి చాలా సమయం పడుతోంది. అందుకే కొంతమంది డ్రైవర్‌లు తప్పనిసరి పరిస్థితుల్లోనే రైడ్స్ రద్దు చేస్తున్నారు.
– షేక్ సలావుద్దీన్, చైర్మన్, తెలంగాణ స్టేట్ ట్యాక్సీ అండ్ డ్రైవర్స్ జేఏసీ
(చదవండి: నిరుద్యోగులకు బస్‌పాస్‌లో 20 శాతం రాయితీ)
Comments
Please login to add a commentAdd a comment