
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇన్‌ఫ్రా దిగ్గజం ‘మేఘా ఇంజనీరింగ్’ (ఎంఈఐఎల్)... గ్యాస్ సరఫరాలోకి ప్రవేశిస్తోంది. గృహ, వాణిజ్య అవసరాలకు గ్యాస్‌ను సరఫరా చేసే ప్రాజెక్ట్‌ను ఆంధప్రదేశ్‌లోని కృష్ణా, కర్ణాటకలోని తుముకూరు, బెల్గాం జిల్లాల్లో ఆరంభిస్తోంది. ప్రయోగాత్మకంగా దీన్ని పరీక్షించామని, త్వరలో పూర్తిస్థాయి సరఫరా ఆరంభిస్తామని శుక్రవారం ఒక ప్రకటనలో సంస్థ తెలియజేసింది. గ్రామీణ ప్రాంతంలో పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరాలోకి అడుగుపెడుతున్న తొలి కంపెనీ ఇదే. ‘‘కృష్ణా జిల్లాలోని నున్న సమీపంలో ఆగిరిపల్లి, కానూరుల్లో ఫిల్లింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. దీనికి అవసరమైన భూగర్భ సరఫరా వ్యవస్థ కూడా సిద్ధమయింది. కృష్ణా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 571 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ ఇప్పటికే పూర్తయింది. తుముకూరు జిల్లాలో 300 కి.మీ., బెల్గాం జిల్లాలో 350 కిలోమీటర్ల భూగర్భ పైప్‌లైన్ కూడా గ్యాస్ సరఫరాకు సిద్ధమయింది. దీనికి అవసరమైన గ్యాస్‌ను ఓఎన్‌జీసీ–గెయిల్ నుంచి పొందేలా ఒప్పందం చేసుకుంటున్నాం’’ అని ఎంఈఐఎల్ హైడ్రోకార్బన్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ రాజేశ్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అందుబాటు ధరల్లో ఉండే ‘మేఘా గ్యాస్’ వాణిజ్య కార్యకలాపాలు... త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారాయన.
రోజుకు 1.4 లక్షల ఘనపుటడుగుల గ్యాస్!
గ్యాస్‌కోసం ఓఎన్‌జీసీ–గెయిల్‌తో ఒప్పందం చేసుకుంటున్నట్లు చెప్పిన రాజేశ్‌రెడ్డి... కృష్ణా జిల్లాలోని నాగాయలంకలో ఓఎన్‌జీసీ ఇటీవలే వాణిజ్యపరమైన ఉత్పత్తి ఆరంభించినట్లు తెలియజేశారు. దీన్నుంచి స్థానిక సరఫరా కోసం రోజుకు 90వేల ఘనపుటడుగుల గ్యాస్‌ను సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు. ఇక కర్ణాటకలోని రెండు జిల్లాలకూ రోజుకు 50వేల ఘనపుటడుగుల గ్యాస్‌ను సరఫరా చేస్తారు. ఇప్పటికే కొందరికి గ్యాస్ కనెక్షన్లు కూడా ఇచ్చామని, త్వరలో పూర్తిస్థాయి సరఫరా మొదలవుతుందని కంపెనీ తెలియజేసింది. వినియోగదారుల ఇబ్బందుల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్‌ను కూడా కంపెనీ రూపొందించింది.