మెర్సిడెస్ కొత్త ఈ-క్లాస్ ఎడిషన్
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా తాజాగా ఈ-క్లాస్ సెడాన్ మోడల్‌లోనే కొత్త వెర్షన్ ‘ఎడిషన్ ఈ’ ను బుధవారం మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్ ‘ఈ200’, ‘ఈ250 సీడీఐ’, ‘ఈ350 సీడీఐ’ అనే మూడు వేరియంట్లలో లభ్యంకానున్నది. వీటి ధరలు వరుసగా రూ.48.60 లక్షలుగా, రూ.50.76 లక్షలుగా, రూ.60.61 లక్షలుగా ఉన్నాయి. అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ పుణేవి. ఈ200 వేరియంట్‌లో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్, ఈ250 సీడీఐలో 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్, ఈ350 సీడీఐలో 3.0 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. ఈ మూడు వేరియంట్లలోనూ 7 స్పీడ్ ఆటోమేటిక్ స్పీడ్ గేర్‌బాక్స్‌ను పొందుపరిచినట్లు పేర్కొంది. ఈ-క్లాస్ మోడల్ ఉత్పత్తి ప్రారంభమై 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా కంపెనీ కొత్త ‘ఎడిషన్ ఈ’ వెర్షన్‌ను ఆవిష్కరించింది. భారత్‌లో ఈ-క్లాస్ మోడల్ తయారీ 1995లో ప్రారంభమైంది. మెర్సిడెస్ బెంజ్ భారత్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన లగ్జరీ కారు ఇదే.