మెక్‌డొనాల్డ్స్‌ను తాకిన ‘మీటూ’ ఉద్యమం
న్యూయార్క్ : అమెరికా ఫాస్ట్ ఫుడ్ దిగ్గజ కంపెనీ మెక్‌డొనాల్డ్స్‌కూ ‘మీటూ’ ఉద్యమం తాకింది. మెక్‌డొనాల్డ్స్‌కు వ్యతిరేకంగా రెండు నేషనల్ అడ్వకసీ గ్రూప్‌లు లైంగిక వేధింపుల కేసులు నమోదు చేశాయి. 9 నగరాల్లో ఈ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న 10 మంది మహిళల తరుఫున ఈ గ్రూప్‌లు ఈ ఫిర్యాదు దాఖలు చేశాయి. ఈ వర్కర్లలో సెయింట్ లూయస్‌కు చెందిన ఓ 15 ఏళ్ల అమ్మాయి కూడా ఉంది. రెస్టారెంట్‌లో పనిచేసే సూపర్‌వైజర్లు తనను లైంగికంగా వేధిస్తున్నారని, అసభ్యకరంగా వ్యవహరిస్తూ.. అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ అమ్మాయి ఆరోపించింది. ఆ ఒక్క అమ్మాయి మాత్రమే కాక ఫిర్యాదుల్లో తమ గోడును వెల్లబుచ్చుకున్న మహిళలందరూ తాము ఎంత లైంగిక వేధింపులకు గురి అవుతున్నామో వివరించారు. ఉద్యోగుల తక్కువ వేతనాలపై పోరాడుతున్న ఫైట్ ఫర్ 15 డాలర్స్ ఈ వివాదాన్ని నిర్వహిస్తోంది. ఈ కేసులకు అవసరమయ్యే లీగల్ కాస్ట్‌లను టైమ్స్ యూపీ లీగల్ డిఫెన్స్ ఫండ్ భరిస్తోంది. సొంతంగా ఈ కేసులను కమిషన్లు, కోర్టుల ముందుకు తీసుకురాలేని మహిళల కోసం నేషనల్ ఉమెన్స్ లా సెంటర్ ఈ ఫండ్‌ను ఏర్పాటు చేసింది.
అమెరికా సమాన ఉద్యోగవకాశాల సంఘం వద్ద ఫైట్ ఫర్ 15 డాలర్స్ ఈ ఫిర్యాదులను దాఖలు చేసింది. ఈ లైంగిక వేధింపుల ఫిర్యాదుపై మెక్‌డొనాల్డ్స్ అధికార ప్రతినిధి టెర్రి హిక్కీ స్పందించారు. తమ వర్క్‌ప్లేస్‌లో లైంగిక వేధింపులకు, వివక్షకు చోటు లేదన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలను కంపెనీ చాలా సీరియస్‌గా తీసుకుందని హిక్కీ చెప్పారు. ఫిర్యాదుల్లో పేర్కొన్న రెస్టారెంట్ పేర్లలో ఫ్రాంచైజీలు నడిపేవే ఎక్కువగా ఉన్నాయని, వాటిని ప్రత్యక్షంగా మెక్‌డొనాల్డ్స్ నడపడం లేదని పేర్కొన్నారు. అయితే ఫిర్యాదులను మెక్‌డొనాల్డ్స్ కార్పొరేషన్‌కు, ఫ్రాంచైజీలకు వ్యతిరేకంగా నమోదయ్యాయి. గత రెండేళ్ల క్రితం కూడా ఇదే రకమైన లైంగిక వేధింపుల ఆరోపణల ఫిర్యాదులను మెక్‌డొనాల్డ్స్‌కు వ్యతిరేకంగా ఫైట్ ఫర్ 15 డాలర్స్ నమోదు చేసింది. ఆ సమయంలో ఆరోపణలను సమీక్షించి, తగిన చర్యలు తీసుకుంటామని మెక్‌డొనాల్డ్స్ హామీ ఇచ్చింది. అయితే పాలసీల్లో ఏమైనా మార్పులు చేశారా అనే విషయంపై స్పందించడానికి మాత్రం అధికార ప్రతినిధి నిరాకరించారు.
Comments
Please login to add a commentAdd a comment