
భవిష్యత్తు.. క్లౌడ్ టెక్నాలజీదే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘ప్రపంచ సాంకేతిక రంగంలో పెనుమార్పులు వస్తున్నాయి. క్లౌడ్ టెక్నాలజీలో అపార అవకాశాలున్నాయి. ఇక క్లౌడ్‌పై మరింత దృష్టి సారించండి. మీ సామర్థ్యాలకు పదును పెట్టండి’ ఇవీ సాఫ్ట్‌వేర్ రంగ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సీఈవో సత్య నాదెళ్ల అన్న మాటలు. హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ కు (ఎంఐడీసీ) సోమవారం విచ్చేసిన నాదెళ్ల.. సంస్థ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అలాగే ఎంఐడీసీ ఉద్యోగులతో ఈ సందర్భంగా ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు.
ఆయన ప్రసంగం ఆసాంతం సరదాగా సాగింది. ప్రతిభ, వనరులు, పట్టుదల సమృద్ధిగా ఉన్నాయని మైక్రోసాఫ్ట్ నిరూపించిందంటూ కితాబిచ్చారు. ఉద్యోగులకు ఈ సందర్భంగా ఆయన భవిష్యత్ దిశా నిర్దేశం చేశారని ఉన్నతోద్యోగి ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. క్లౌడ్ టెక్నాలజీ సత్య నాదెళ్ల బ్యాక్‌గ్రౌండ్ కావడంతో ఆయన సందేశం ప్రధానంగా క్లౌడ్‌పైనే సాగిందని చెప్పారు. సీఈవోగా బాధ్యతలు స్వీకరించే వరకు ఆయన మైక్రోసాఫ్ట్ క్లౌడ్, ఎంటర్‌ప్రైజ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. సంస్థ క్లౌడ్ రంగంలోకి ప్రవేశించడంలో ఆయనది కీలక పాత్ర.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో..: మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ భారత్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి పనిచేయనుందని సత్య నాదెళ్ల ఉద్యోగులను ఉద్ధేశించి అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును ఆదివారం ఆయన మర్యాదపూర్వకంగా కలసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం సైతం సాంకేతిక పరిజ్ఞానాన్ని వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని చూస్తోంది.
అలాగే హైదరాబాద్‌ను వైఫై నగరంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా చేసుకుంది కూడా. ఈ నేపథ్యంలో ఎంఐడీసీలో సత్య నాదెళ్ల మాటలనుబట్టి చూస్తుంటే తెలంగాణ ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్ మధ్య సాంకేతిక సహకార ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయి. డిజిటల్ ఇండియా ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు ప్రభుత్వంతో, పరిశ్రమతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు మైక్రోసాఫ్ట్ సీఈవో ఇప్పటికే ప్రకటించారు.
సీఈవోగా తొలి పర్యటన..
మైక్రోసాఫ్ట్ సీఈవోగా అత్యున్నత పదవిని చేజిక్కించుకున్న తర్వాత సత్య నాదెళ్ల హైదరాబాద్‌కు రావడం ఇదే తొలిసారి. అలాగే భాగ్యనగరిలోని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్‌లో అడుగు పెట్టడం కూడా మొదటిసారి కావడం గమనార్హం. ఉద్యోగులతో మాట్లాడుతున్నంత సేపు మొహంపై చిరునవ్వుతోనే ఉన్నారు. ఉద్యోగులు సైతం ఆనందంగా గడిపారు. సమావేశమందిరం వేదికపై నుంచి ఉద్యోగులను ఉద్ధేశించి నాదెళ్ల మాట్లాడారు.
వేదికకు ముందు వైపు సమయాన్ని తెలిపే డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఎంఐడీసీ షెడ్యూల్ ప్రకారం ఆయన ప్రసంగం సాగింది. మీడియాను ఎవరినీ కార్యాలయం లోనికి అనుమతించ లేదు. సమావేశ వివరాలను సైతం గోప్యంగా ఉంచారు. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో సత్య నాదెళ్ల ఫోన్‌లో మాట్లాడినట్టు తెలిసింది. వైజాగ్‌లో మైక్రోసాఫ్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా చంద్రబాబు కోరినట్టు సమాచారం.
హైదరాబాద్‌లో విస్తరణ..
సత్య నాదెళ్ల నోటి వెంట హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ ‘విస్తరణ’ అన్న మాటలు వెలువడ్డాయి. క్లౌడ్ టెక్నాలజీ ఏర్పాట్లతోపాటు ఉద్యోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన సందేశాన్నిబట్టి అర్థమవుతోందని మైక్రోసాఫ్ట్ అధికారి చెప్పారు. హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ కార్యాలయం 54 ఎకరాల్లో ఏర్పాటైంది.
అమెరికా వెలుపల అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఇదే. సర్వర్, టూల్స్ బిజినెస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ బిజినెస్ సొల్యూషన్స్, విండోస్, విండోస్ లైవ్, ఆన్‌లైన్ సర్వీసెస్ విభాగాలు ఇక్కడ విస్తరించాయి. ఆఫీస్, విండోస్, విజువల్ స్టూడియో, డెవలపర్ టూల్స్ ఫర్ విండోస్ ఫోన్, బింగ్ అభివృద్ధిలో ఎంఐడీసీ ఇంజనీర్ల పాత్ర అత్యంత కీలకం.