వచ్చే నెలలో హైదరాబాద్‌కు సత్యనాదెళ్ల!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల డిసెంబరులో హైదరాబాద్‌కు రానున్నట్టు సమాచారం. క్లౌడ్ సేవల కోసం ఉద్దేశించిన డేటా సెంటర్ ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వంతో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలే మైక్రోసాఫ్ట్ పుణే, ముంబై, చెన్నైలో డేటా సెంటర్లు ప్రారంభించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి భారత్‌లో తొలి డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని సంస్థ గతంలోనే భావించింది. కొన్ని అనివార్య కారణాలతో ఈ ప్రతిపాదనకు బ్రేక్ పడింది.
భాగ్యనగరిలో కంపెనీకి సొంత స్థలం కూడా ఉందని మైక్రోసాఫ్ట్ వర్గాలు చెబుతున్నాయి. డేటా సెంటర్ ఏర్పాటు ఆలోచనను మైక్రోసాఫ్ట్ విరమించుకోలేదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. వచ్చే నెల హైదరాబాద్‌కు నాదెళ్ల వస్తున్నారని, ఈ సందర్భంగా సెంటర్ నెలకొల్పే అంశంపై స్పష్టత రావొచ్చన్నారు. నూతన పారిశ్రామిక విధానం ప్రకటించిన తర్వాత దేశ, విదేశీ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులకు ఉత్సాహం చూపిస్తున్నాయని గుర్తు చేశారు.
కాగా, మైక్రోసాఫ్ట్‌కు సీఈవో బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నాదెళ్ల సెప్టెంబరులో హైదరాబాద్‌లో అడుగు పెట్టారు. గచ్చిబౌలిలో ఉన్న మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్‌లో సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ సెంటర్‌ను విస్తరించనున్నట్టు ఆ సమయంలో ప్రకటించారు కూడా.