మైక్రోసాఫ్ట్‌లో 4,000 ఉద్యోగాల కోత!!
అమెరికా వెలుపల ఎక్కువ కోతలకు ఆస్కారం
న్యూయార్క్: టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘మైక్రోసాఫ్ట్’.. 4,000 వరకు ఉద్యోగులను ఇంటికి పంపనుంది. సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగాల్లో అతిపెద్ద పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపు చోటుచేసుకోనుంది. సిబ్బంది తొలగింపులు ఎక్కువగా అమెరికా వెలుపల ఉంటాయని సమాచారం. సంస్థ తన భాగస్వాములకు, కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికి కొన్ని మార్పులను చేపడుతోందని మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
‘ప్రస్తుతం మేం కొందరి ఉద్యోగులను గుర్తించడానికి చర్యలు తీసుకుంటున్నాం. వీరి ఉపాధి రిస్క్‌లో ఉంటుంది. ఇతర కంపెనీల మాదిరిగానే మేం కూడా ఎప్పటిలాగే వ్యాపార కార్యకలాపాలను పునఃసమీక్షించుకుంటున్నాం. దీనివల్ల కొన్ని విభాగాల్లో పెట్టుబడులు పెరగొచ్చు. అలాగే కొన్ని చోట్ల ఉపాధి తగ్గొచ్చు’ అని వివరించారు. అయితే మైక్రోసాఫ్ట్‌లో 3,000–4,000 మధ్యలో ఉద్యోగాల కోత ఉంటుందని న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిన వార్తలను ఈయన నిర్ధారించలేదు. కాగా మైక్రోసాఫ్ట్‌లో ప్రపంచవ్యాప్తంగా 1,21,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.