మైక్రోసాఫ్ట్‌లో 7,800 ఉద్యోగాల కోత
నోకియా డీల్‌లో 7.6 బిలియన్ డాలర్ల రైటాఫ్
న్యూయార్క్ : మొబైల్ పరికరాల వ్యాపార విభాగం పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7,800 ఉద్యోగాల్లో కోత విధించనుంది. అలాగే నోకియా డివెజైస్ అండ్ సర్వీసెస్ వ్యాపారం కొనుగోలుకు సంబంధించి 7.6 బిలియన్ డాలర్లు రైటాఫ్ చేయనుంది. దీనికి అదనంగా దాదాపు 750-850 మిలియన్ డాలర్ల మేర రీస్ట్రక్చరింగ్ వ్యయాలను భరించనుంది. కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల.. మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు రాసిన ఈ-మెయిల్‌లో ఈ విషయాలు వివరించారు.
‘ఫోన్ల వ్యాపారంపై తీసుకున్న నిర్ణయాల ప్రభావాలను మీకు తెలియజేయదల్చుకున్నాను. ఈ మార్పులు, చేర్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఫోన్ల వ్యాపార విభాగంలో దాదాపు 7,800 దాకా ఉద్యోగాల్లో కోత పడే అవకాశం ఉంది’ అని ఈమెయిల్‌లో ఆయన పేర్కొన్నారు. అయితే, భారత్‌లో ఈ ప్రభావం ఎంత మేరకు ఉండొచ్చన్నది వెల్లడించలేదు.