ఉద్యోగాలకు కోతపెడుతున్న మైక్రోసాఫ్ట్
టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. లండన్‌లోని తన స్కైప్ కార్యాలయాన్ని మూసేస్తోంది. దాంతో సుమారు 400 మంది తమ ఉద్యోగాలు కోల్పోనున్నారు. కొన్ని ఇంజనీరింగ్ పొజిషన్లను కలిపేందుకు మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దాంతో చాలామంది స్కైప్ ఉద్యోగులపై వేటు పడేప అవకాశం కనిపిస్తోంది. అయితే, ప్రస్తుతానికి కేవలం లండన్‌లో ఉన్న కార్యాలయాన్ని మాత్రమే మూసేశామని.. రెడ్మండ్, పాలో ఆల్టో, వాంకూవర్ సహా యూరప్‌లోని పలు కార్యాలయాలను తెరిచే ఉంచుతున్నట్లు స్కైప్ చెబుతోంది.
అయితే స్కైప్‌ను మైక్రోసాఫ్ట్ టేకోవర్ చేసినప్పటి నుంచి క్రమంగా అందులోని పాత ఉద్యోగులను తొలగించి, తమ సొంత ఉద్యోగులను నియమిస్తోందని కొందరు మాజీ ఉద్యోగులు తమ పేరు బయట పెట్టొద్దంటూ చెప్పారు. ఒకప్పుడు ఉచిత వీడియో కాలింగ్ అంటే కేవలం స్కైప్ మీద మాత్రమే ఆధారపడేవాళ్లు. కానీ ఇప్పుడు దానికి ఆదరణ తగ్గింది. వాట్సప్, ఫేస్‌బుక్ మెసెంజర్ లాంటివి రావడంతో పాటు వీడియో కాలింగ్ యాప్స్ కూడా చాలా వచ్చేశాయి. దాంతో ఎప్పటినుంచో స్కైప్‌కు అలవాటు పడినవాళ్లు కూడా క్రమంగా దానికి దూరమవుతున్నట్లు సమాచారం.