1,850 ఉద్యోగాలకు మైక్రోసాప్ట్ కోత
స్మార్ట్ ఫోన్ వ్యాపారాన్ని తగ్గించుకోనున్న నేపథ్యంలో 1,850 ఉద్యోగాలకు కోత పెట్టనున్నట్లు మైక్రోసాప్ట్ కార్పొరేషన్ ప్రకటించింది. ఎక్కువ ఉద్యోగాల కోతలు ఫిన్ లాండ్ లో ఉంటాయని తెలిపింది. హ్యాండ్ సెట్ల తయారీ సంస్థ నోకియాను కొనుగోలు చేయడం ద్వారా మైక్రోసాప్ట్ ఫోన్ల వ్యాపారంలోకి అడుగుపెట్టింది. స్మార్ట్ ఫోన్ వ్యాపారాన్ని క్రమబద్ధీకరించే క్రమంలో ఫిన్‌లాండ్‌లోని రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ యూనిట్‌ను మూసేస్తున్నామని ప్రకటించింది.
అయితే మొబైల్ ప్లాట్ ఫాంలో విండోస్ 10ను అభివృద్ధి చేస్తామని, లుమియా స్మార్ట్ ఫోన్లకు సపోర్టుగా ఉంటామని పేర్కొంది. కొత్త ఫోన్ల అభివృద్ధిపై కూడా మైక్రోసాప్ట్ ఎలాంటి అభిప్రాయం వ్యక్తంచేయలేదు. ఫోన్లలో కొత్త ఆవిష్కరణలు కల్పిస్తామని, అన్ని మొబైల్ ప్లాట్ ఫాంలకు క్లౌడ్ సర్వీసుల్లో సహకరిస్తామని మైక్రోసాప్ట్ తెలిపింది. ఈ నెల మొదట్లో 35 కోట్ల డాలర్ల బేసిక్ ఫోన్ల వ్యాపారాన్ని మైక్రోసాప్ట్ ఉపసంహరించుకుంది.