న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న 2018–19 బడ్జెట్లో.. మధ్య తరగతి ప్రజలకు పన్ను ఊరట కల్పించే అవకాశాలున్నాయనే అంచనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా వ్యక్తిగత పన్ను మినహాయింపు పరిమితి పెంపు, పన్ను శ్లాబులను మధ్య తరగతికి అనుగుణంగా మలచడం వంటి కీలకాంశాలు ఈ బడ్జెట్లో ఉండే అవకాశముందని, ఆయా ప్రతిపాదనలు ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉన్నాయని సమాచారం. ఉన్నత వర్గాల సమాచారం ప్రకారం..
♦ వ్యక్తిగత వార్షిక పన్ను మినహాయింపు పరిమితి ప్రస్తుతం రూ.2.5 లక్షలుగా ఉంది. దీనిని కనీసం రూ.3 లక్షలు లేదా రూ.5 లక్షలకు పెంచే ప్రతిపాదన ఉంది.
♦ మధ్య తరగతికి... ప్రత్యేకించి వేతనవర్గానికి సానుకూలంగా ఉండేలా పన్ను శ్లాబుల్ని మెరుగుపరచాలనేది ఆర్థికశాఖ పరిశీలనలో ఉన్న మరో కీలక ప్రతిపాదన. ముఖ్యంగా ద్రవ్యోల్బణం సమస్య నేపథ్యంలో– దీని నుంచి సామాన్యుడు ఊరట పొందాలన్న లక్ష్యంగా శ్లాబుల రూపకల్పన జరుగుతుంది.
♦ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ గత బడ్జెట్‌లో శ్లాబులకు సంబంధించి ఎటువంటి మార్పులూ చేయలేదు. అయితే పన్ను చెల్లింపుదారులకు స్వల్ప ఊరటనిచ్చేలా... రూ.2.5 లక్షలు – రూ.5 లక్షల మధ్య వార్షిక ఆదాయం కలిగిన వారి పన్ను రేటును 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.
♦ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తులకు ప్రస్తుతం 20 శాతం పన్ను ఉండగా... దానిని 10 శాతానికి తగ్గించే అవకాశం ఉంది.
♦ ఇక రూ.10 లక్షల పైబడి ఆదాయం కలిగిన వారికి ప్రస్తుతం పన్ను 30 శాతం ఉంది. అయితే ఇందుకు సంబంధించి కొత్త శ్లాబులను ఏర్పాటుచేసే అవకాశం ఉంది. దీని ప్రకారం రూ.10 లక్షలు–రూ.20 లక్షలకు కొత్త శ్లాబ్ వస్తుంది. ఈ మొత్తం శ్రేణిలో ఆదాయం పొందే వారు 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
♦ రూ.20 లక్షలపైబడి ఆదాయం పొందేవారు 30 శాతం పన్ను చెల్లించాల్సిరావచ్చు.
♦ బడ్జెట్‌కు ముందు పారిశ్రామిక మండలి– సీఐఐ ఆర్థికమంత్రిత్వశాఖకు ఒక మెమోరాండం సమర్పించింది. ‘‘ద్రవ్యోల్బణం కారణంగా జీవన వ్యయం గణనీయంగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో వ్యక్తిగత పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలి. అలాగే ఇతర ఆదాయ శ్లాబులనూ మార్చాలి. ముఖ్యంగా దిగువ ఆదాయ వర్గానికి సానుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలి.’’ అని సీఐఐ ఈ వినతి పత్రంలో కోరింది.
♦ ప్రస్తుతం ఉన్న గరిష్ట శ్లాబ్ రేటును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించాలన్నది సీఐఐ కోరిక. అయితే ఈ దిశలో మాత్రం ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకోకపోవచ్చన్నది అంచనా. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం– చేసే వ్యయం మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీలో 3.2 శాతంగా ఉండాలన్నది లక్ష్యం) కట్టుతప్పే ప్రమాదం ఉండటమే దీనికి కారణం.
♦ జూలై 1వ తేదీ నుంచి పరోక్ష పన్ను స్థానంలో ప్రవేశపెట్టిన ఏకీకృత వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వ్యవస్థలో వసూళ్లు తక్కువగా ఉండడం ద్రవ్యలోటు సమస్య కోణంలో పరిశీలించాల్సిన అంశం. జీఎస్‌టీ వసూళ్లు వరుసగా రెండ వ నెల నవంబర్‌లోనూ తగ్గాయి. రూ.80,808 కోట్లుగా నమోదయ్యాయి. జూలైలో నూతన పన్ను వ్యవస్థ ప్రారంభమైన తర్వాత వసూళ్లలో ఇది కనిష్టస్థాయి. అక్టోబర్‌లో జీఎస్‌టీ వసూళ్లు రూ.83,000 కోట్లయితే, నవంబర్‌లో ఇవి మరింత తగ్గి రూ. 80,808 కోట్లకు చేరాయి. జూలైలో జీఎస్‌టీ వసూళ్లు రూ. 95,000 కోట్లు. ఆగస్టులో రూ.91,000 కోట్లు. సెప్టెంబర్‌లో రూ.92,150 కోట్లు.
♦ ఇక ద్రవ్యలోటుపై కేంద్రం రాజీ పడే అవకాశం ఉందని ఇప్పటికే విశ్లేషణలు వస్తున్నాయి. డీబీఎస్ అంచనాల ప్రకారం 2017–18 స్థూల దేశీయోత్పత్తిలో ద్రవ్యలోటు 3.5 శాతంగానే (2016–17 ఆర్థిక సంవత్సరం స్థాయిలోనే) ఉండే అవకాశం ఉంది. అయితే బడ్జెట్ లక్ష్యం 3.2 శాతమే. ఇక 2018–19లో ద్రవ్యలోటు లక్ష్యం 3 శాతం. అయితే దీనిని 3.2–3.3 శాతం శ్రేణిలో ఉంచేందుకు కేంద్రం సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయని డీబీఎస్ వివరించింది. నవంబర్ నాటికే కేంద్రం ద్రవ్యలోటు బడ్జెట్‌లో నిర్దేశించుకున్న దాన్ని మించి 112 శాతం స్థాయికి తాకిన విషయం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లోటుభర్తీకి కేంద్రం ఇటీవలే రుణ ప్రణాళికను అదనంగా రూ.50,000కోట్లు పెంచడం ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సిన మరోఅంశం.
♦ ఆర్థిక మందగమనం నేపథ్యంలో డిమాండ్ పెంపు దిశలో పన్నులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలని మరో పారిశ్రామిక మండలి ఫిక్కీ కూడా కేంద్రాన్ని కోరింది. ఫిక్కీ ప్రతిపాదనల్లో ఆదాయపు పన్ను శ్లాబుల సమీక్ష ఒకటి.
♦ 2006–07 అసెస్‌మెంట్ ఇయర్ నుంచీ అమల్లోకి వచ్చేలా రద్దయిన స్టాండర్డ్ డిడక్షన్ (వేతన ఉద్యోగులకు వారి ట్యాక్స్‌బుల్ ఇన్‌కమ్‌పై వర్తింపు)ను తిరిగి ప్రవేశపెట్టాలన్న డిమాండ్‌ను కూడా పలు పారిశ్రామిక మండళ్లు చేస్తున్నాయి. పన్ను భారాన్ని తగ్గించడానికి కనీసం రూ.లక్ష మేర స్టాండర్డ్ డిడక్షన్ విధానాన్ని వర్తింపజేయాలన్నది ప్రధాన డిమాండ్లలో ఒకటి.
మధ్యతరగతికి పన్నుల ఊరట!
Published Wed, Jan 10 2018 12:38 AM | Last Updated on Mon, Aug 20 2018 5:20 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment