వడ్డీరేట్లు మరింత దిగిరావాలి: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: బ్యాంకులు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు (ప్రస్తుతం 6.5%) మరో రెండు శాతం తగ్గాల్సిన అవసరం ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమం సందర్భంగా తెలిపారు. ఇది దేశ చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కొండంత అండనిస్తుందని వివరించారు. అయితే 200 బేసిస్ పాయింట్లు ఒకేసారి తగ్గించాలా... లేక విడతల వారీగా తగ్గించాలా అన్న అంశానికి సంబంధించి నిర్దిష్ట కాల పరిమితిని ఏమీ ఆమె పేర్కొనలేదు.
అక్టోబర్ 4వ తేదీన ఆర్‌బీఐ తదుపరి పాలసీ సమీక్ష నేపథ్యంలో నిర్మలా సీతారామన్ ఈ వ్యాఖ్య చేశారు. తదుపరి పాలసీ కొత్త గవర్నర్ ఉర్జిత్ పటేల్ సమర్పిస్తారు. లేదా అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆరుగురు సభ్యుల కమిటీ మెజారిటీ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకునే వీలుంది. సెప్టెంబర్ 4తో రాజన్ పదవీ కాలం పూర్తికానుంది. ఇప్పటికే ఆర్‌బీఐ రెపో కోత ప్రయోజనం కస్టమర్‌కు అందేలా చర్యలు ఉండాలని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో బ్యాంకింగ్‌కు తగిన సూచనలు చేసే విషయంపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో చర్చిస్తానని కూడా వెల్లడించారు.