న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: గిఫ్ట్ ఐటమ్స్ దిగుమతుల నిబంధనలు దుర్వినియోగం అవుతుండటంపై కేంద్రం దృష్టి సారించింది. కస్టమ్స్ సుంకాలను ఎగవేసే ఉద్దేశంతో బహుమతుల పేరిట రూ. 5,000 దాకా విలువ చేసే ఐటమ్స్ దిగుమతి చేసుకుంటుండటాన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకోనుంది. ప్రస్తుతం రూ. 5,000 దాకా ఉన్న మినహాయింపును ఎత్తివేసే అంశాన్ని పరిశీలిస్తోంది. అలాగే ఒక వ్యక్తికి ఏడాదిలో గరిష్టంగా నాలుగు కన్సైన్‌మెంట్స్ మాత్రమే బహుమతులుగా అనుమతించే విషయమూ పరిశీలనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
గతేడాది సెప్టెంబర్‌లో ఈ–కామర్స్ రంగంపై జరిగిన కార్యదర్శుల అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచ్చినట్లు వివరించాయి. దీనిపై తాము చేసిన సిఫార్సులపై కస్టమ్స్ విభాగం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఒక అధికారి తెలిపారు. రూ. 5,000 దాకా విలువ చేసే గిఫ్ట్ ఐటమ్స్ దిగుమతులకు కస్టమ్స్ సుంకాల నుంచి మినహాయింపునిస్తున్న భారత విదేశీ వాణిజ్య చట్టంలోని నిబంధనలను చైనాకి చెందిన పలు ఈ–కామర్స్ కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయంటూ పరిశ్రమ వర్గాలు చాలాకాలంగా ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment