
న్యూఢిల్లీ: దేశీ విమాన ప్రయాణికులకిది శుభవార్తే. టెలికం రెగ్యులేటర్ ట్రాయ్... తాజాగా ఇన్–ఫ్లైట్ కనెక్టివిటీపై తన ప్రతిపాదనలను నివేదిక రూపంలో విడుదల చేసింది. ఇందులో... శాటిలైట్, టెరిస్ట్రియల్ నెట్‌వర్క్ ద్వారా దేశీ విమాన ప్రయాణంలో మొబైల్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ సేవల్ని అనుమతించాలని సిఫార్సు చేసింది. కొన్ని షరతులు కూడా విధించింది.
⇒ విమానం 3,000 మీటర్లకన్నా ఎత్తులో ఉన్నపుడు మాత్రమే వాటిలో మొబైల్ కమ్యూనికేషన్ సర్వీసులను అనుమతించాలి. టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో ఈ సేవలుండకూడదన్న మాట.
⇒ విమాన ప్రయాణం సమయంలో మొబైల్ ఫోన్లను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచినప్పుడే వై–ఫై సర్వీసులను అందించాలి.
⇒ ఇన్–ఫ్లైట్ కమ్యూనికేషన్స్ (ఐఎఫ్‌సీ) సర్వీస్ ప్రొవైడర్ అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేయాలి. ఐఎఫ్‌సీ సర్వీస్ ప్రొవైడర్ ప్రయాణికులకు సేవలందించాలంటే తప్పకుండా టెలికం విభాగం (డాట్) వద్ద నమోదు చేసుకొని ఉండాలి.
⇒ఐఎఫ్‌సీలో వై–ఫై ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించడం, మొబైల్ కమ్యూనికేషన్ ఆన్‌బోర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎంసీఏ) అనే విభాగాలుండాలి.
ట్రాయ్ గతేడాది సెప్టెంబర్‌లో ఇన్‌ఫ్లైట్ కనెక్టివిటీపై చర్చా పత్రాన్ని విడుదల చేసింది. వచ్చిన అభిప్రాయాలను క్రోడికరించి ఇప్పుడు తాజాగా నివేదికను విడుదల చేసింది. ట్రాయ్ సిఫార్సులు అమల్లోకి వస్తే విమాన ప్రయాణ సమయంలో మొబైల్స్, ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చు. భద్రతా కారణాలరీత్యా మన దేశంలో విమానాల్లో మొబైల్స్, ఇంటర్నెట్ వినియోగాన్ని అనుమతించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment