దేశవ్యాప్తంగా మొబైల్ నంబర్ పోర్టబిలిటీ
నేటి నుంచే పూర్తి స్థాయిలో అమలు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పూర్తి స్థాయి మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) శుక్రవారం అమల్లోకి వస్తోంది. ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌తో పాటు ప్రైవేట్ రంగ కంపెనీలు ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, ఆర్‌కామ్.. ఇందుకోసం అన్ని సన్నాహాలు చేసినట్లు తెలిపాయి. అలాగే, యూనినార్, సిస్టెమా శ్యామ్ టెలీసర్వీసెస్, వీడియోకాన్ కూడా ఎంఎన్‌పీ అమలుకు సిద్ధమయ్యాయి. మొబైల్ వినియోగదారులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే .. వేరే టెలికం ఆపరేటరుకు మారినా పాత నంబరునే కొనసాగించుకునేందుకు ఎంఎన్‌పీ వల్ల వెసులుబాటు లభిస్తుంది. దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు జూలై 3 ఆఖరు తేదిగా ప్రభుత్వం నిర్దేశించింది.
ఎంఎన్‌పీ సేవలు అందించేందుకు తమ నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేసినట్లు ఐడియా సెల్యులార్ తెలిపింది. తమ ప్రీ-పెయిడ్, పోస్ట్-పెయిడ్ కస్టమర్ల కోసం, వేరే సంస్థల నుంచి తమ కంపెనీకి మారే కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నట్లు రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) తెలిపింది. అటు ఎయిర్‌టెల్ కూడా ఎంఎన్‌పీకి సంబంధించి ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. నంబర్ పోర్టబిలిటీ అమలు కోసం తమ ఐటీ, నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అప్‌గ్రేడ్ చేసుకున్నట్లు యూనినార్ వెల్లడించింది.