సహజవాయువు ధర పెంపుపై మళ్లీ మోడీ భేటీ
న్యూఢిల్లీ: త్వరలో ప్రకటించనున్న సహజవాయువు(గ్యాస్) ధర పెంపుపై ప్రధాని నరేంద్ర మోడీ ఆయిల్ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో మరోసారి సమావేశమయ్యారు. మూడు రోజుల్లో ఇది రెండోసారికాగా, ఆమోదయోగ్యకరమైన విధానంలో గ్యాస్ ధర పెంపును చేపట్టాలని మోడీ భావిస్తున్నారు. ప్రధాన్‌తో ప్రధాని శుక్రవారం ఈ అంశంపై దాదాపు ఐదు గంటలపాటు సమావేశమైన సంగతి తెలిసిందే. ఇంధన రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా చర్చించగా, ఆదివారంనాటి తాజా సమావేశానికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సైతం హాజరుకావడం విశేషం.
ఆయిల్, గ్యాస్ రంగంలో పెట్టుబడులను ఆకట్టుకునేందుకు వెంటనే గ్యాస్ ధర పెంపును చేపట్టాల్సిన అవసరమున్నదని ప్రభుత్వం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, గత ప్రభుత్వం ఒక ఎంబీటీయూ గ్యాస్ ధరను ప్రస్తుత 4.2 డాలర్ల నుంచి 8.4 డాలర్లకు పెంచేందుకు గతంలోనే నిర్ణయించింది. ఈ ధరను సవరించాలని కొత్త ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.