జాతీయ రహదారులు మోదీ చలవే  | Lakshman comments on National highways | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారులు మోదీ చలవే 

Published Thu, Apr 26 2018 1:25 AM | Last Updated on Tue, Aug 21 2018 9:38 PM

Lakshman comments on National highways - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి రాష్ట్రంలో జాతీయ రహదారుల విషయంలో తెలంగాణ బాగా వెనకబడి ఉండేదని, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక దేశంలోనే రెండో స్థానానికి చేరుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. ప్రస్తుతం జాతీయ సగటు కంటే తెలంగాణ జాతీయ రహదారుల సగటు ఎక్కువగా ఉందని గుర్తు చేశారు. ఇది కచ్చితంగా మోదీ ప్రభుత్వం ఘనతనేనని పేర్కొన్నారు. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

‘మే ఐదో తేదీన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ రాష్ట్రానికి వస్తున్నారు. ఎలివేటెడ్‌ కారిడార్లు, ఎక్స్‌ప్రెస్‌ వేల నిర్మాణానికి సంబంధించి రూ.1,523 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేస్తారు’అని వెల్లడించారు. ‘ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో కేవలం 2,647 కి.మీ. జాతీయ రహదారులు ఉండగా, మోదీ ప్రభుత్వం కొలువుదీరిన ఈ నాలుగేళ్లలో కొత్తగా 2,656 కి.మీ. రహదారులను మంజూరు చేశారు. వీటి నిర్మాణం సాగుతుండగానే కొత్తగా మరిన్ని ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు. అరాంఘర్‌–శంషాబాద్‌ మధ్య ఆరు లైన్ల ఎలివేటెడ్‌ కారిడార్, ఉప్పల్‌ నుంచి నారపల్లి వరకు ఆరు లైన్ల ఎలివేటెడ్‌ కారిడార్, అంబర్‌పేట కూడలి వద్ద నాలుగు లైన్ల ఫ్‌లై ఓవర్‌ నిర్మాణాలకు గడ్కరీ శంకుస్థాపన చేస్తారు’అని వివరించారు. భారత్‌ మాల ప్రాజెక్టులో భాగంగా ఆర్థిక కారిడార్లు, లాజిస్టిక్‌ పార్కుల అభివద్ధికి కేంద్రం చర్యలు చేపట్టినట్లు చెప్పారు.  

రూ.4 వేల కోట్లతో రీజినల్‌ రింగ్‌రోడ్డు 
హైదరాబాద్‌ వెలుపల రూ.4 వేల కోట్ల వ్యయంతో రీజినల్‌ రింగురోడ్డును కేంద్రం మంజూరు చేసిందని లక్ష్మణ్‌ వెల్లడించారు. సంగారెడ్డి–గజ్వేల్‌–భువనగిరి–చౌటుప్పల్‌ వరకు 156 కిలోమీటర్ల మార్గం, చౌటుప్పల్‌–షాద్‌నగర్‌–చేవెళ్ల వరకు 186 కి.మీ.లు, మెదక్‌–సిద్దిపేట–ఎల్కతుర్తి మధ్య 133 కి.మీ.లు, జాతీయ రహదారులుగా ఘట్కేసర్‌–మహబూబాబాద్‌–కొత్తగూడెం రహదారులను మం జూరు చేసిందని కొనియాడారు. హైదరాబాద్‌–అమరావతి, హైదరాబాద్‌–బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ వేల నిర్మాణం తెలంగాణకు పెద్ద ప్రాజెక్టులుగా మారబోతున్నాయని వెల్లడించారు.

ఇలా తెలంగాణ అభివద్ధికి మోదీ ప్రభుత్వం ప్రాజెక్టులు మంజూరు చేసి అమలు చేస్తుంటే, రాష్ట్రంపై కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని కేసీఆర్‌ వ్యాఖ్యానించటం దారుణమన్నారు. ఇటీవల మారిన పరిణామాల దష్ట్యా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని మోదీపై విషంగక్కుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా అబద్ధాల ప్రచారాన్ని కట్టిపెట్టాలన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఇటీవల రాష్ట్రానికి వచ్చి పెద్ద సంఖ్యలో ఉజ్వల పతకం కింద ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు పంపినీ చేశారని, వైద్య ఆరోగ్య మంత్రి నడ్డా.. ఎయిమ్స్‌ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించారని తెలిపారు. కర్ణాటకలో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని, ఆ తర్వాత రాష్ట్రంలో అమిత్‌ షా పర్యటన ఉంటుందన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement