
గౌరవ కాన్సుల్‌గా నియామక పత్రాన్ని అందుకుంటున్న సైయంట్ వ్యవస్థాపక చైర్మన్ బీవీఆర్ మోహన్
జర్మనీ గౌరవ కాన్సుల్‌గా మోహన్ రెడ్డి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఇంజినీరింగ్ ఐటీ సేవల సంస్థ సైయంట్ వ్యవస్థాపక చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి తాజాగా జర్మనీ గౌరవ కాన్సుల్‌గా నియమితులయ్యారు. ఇరు దేశాల వాణిజ్య, సాంస్కృతిక బంధాలు పటిష్టం చేసేందుకు ఆయన తోడ్పాటు అందించనున్నారు. నియామకం పురస్కరించుకుని బుధవారమిక్కడ జరిగిన కార్యక్రమంలో మోహన్‌రెడ్డి, భారత్‌లో జర్మనీ దౌత్యవేత్త మార్టిన్ నెయ్, తెలంగాణ..ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల కాన్సుల్ జనరల్ అహిమ్ ఫ్యాబిగ్ పాల్గొన్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుతం 17.33 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉందని ఈ సందర్భంగా మోహన్ రెడ్డి తెలిపారు.
గతేడాది జర్మనీ నుంచి బిలియన్ డాలర్ల పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారత్‌కి వచ్చాయని వివరించారు. శాస్త్ర, సాంకేతిక రంగాలు, వృత్తి సంబంధ నైపుణ్యాల శిక్షణ, చిన్న మధ్య తరహా సంస్థల అభివృద్ధి తదితర విభాగాల్లో జర్మనీ సహకారం భారత్‌కు ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉంటున్న జర్మనీ పౌరులకు కాన్సులర్‌పరమైన సహాయ సహకారాలను గౌరవ కాన్సుల్ హోదాలో మోహన్ రెడ్డి అందిస్తారు. భారత్‌లో జర్మనీకి గౌరవ కాన్సుల్ ఇప్పటిదాకా గోవాలో మాత్రమే ఉండగా.. రెండో కాన్సుల్ హోదా మోహన్‌రెడ్డికి దక్కింది.
భారత వ్యాపార భాగస్వామ్య దేశాల్లో జర్మనీది ఆరో స్థానమని మార్టిన్ నెయ్ వివరించారు. దాదాపు 1,700 పైచిలుకు జర్మన్ కంపెనీలు భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నాయని, 120 పైగా సంస్థలు గతేడాది మరిన్ని పెట్టుబడులు పెట్టాయన్నారు. ఇరుదేశాల మధ్య ఉన్న పెట్టుబడుల రక్షణ ఒప్పందాన్ని మరింతగా మెరుగుపర్చుకోవాల్సి ఉందని తెలిపారు. యూరోపియన్ యూనియన్‌తో ఇండియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చల విషయంలో పురోగతి కనిపిస్తోందని మార్టిన్ చెప్పారు. తమ దేశంలో విద్యాభ్యాసానికి వచ్చే భారతీయ విద్యార్థుల సంఖ్య గత అయిదేళ్లుగా గణనీయంగా పెరిగిందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కూడా భేటీ అయిన సందర్భంగా స్మార్ట్ సిటీలకు తోడ్పాటు తదితర అంశాలు చర్చించినట్లు మార్టిన్ తెలిపారు.