మాండెలీజ్‌కు జరిమానా..
న్యూఢిల్లీ: భారత కార్యకలాపాల్లో అనుబంధ సంస్థ అవకతవకలకు పాల్పడినందుకు గాను అంతర్జాతీయ కన్ఫెక్షనరీ సంస్థ మాండెలీజ్ ఇంటర్నేషనల్‌కు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) 13 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 88.5 కోట్లు) జరిమానా విధించింది. వివరాల్లోకి వెడితే.. బ్రిటన్‌కు చెందిన క్యాడ్‌బరీస్‌ని అమెరికన్ సంస్థ మాండెలీజ్ 2010లో కొనుగోలు చేసింది. దీంతో క్యాడ్‌బరీస్ భారత విభాగం మాండెలీజ్‌కు అనుబంధ సంస్థగా మారింది.
ఇది గతంలో (2009) హిమాచల్ ప్రదేశ్‌లో ప్లాంట్ విస్తరణకి అవసరమైన నియంత్రణపరమైన అనుమతుల కోసం క్యాడ్‌బరీస్ ఇండియా అనధికారిక ఏజంటుకు సుమారు రూ. 62 లక్షలు ముట్టచెప్పినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. విదేశాల్లో అవినీతి చట్టాల ఉల్లంఘన కిందకి వచ్చే ఈ అభియోగాలపై విచారణ జరిపిన ఎస్‌ఈసీ తాజాగా మాండెలీజ్‌కు జరిమానా విధించింది. ఎస్‌ఈసీ ఆదేశాలకు అనుగుణంగా పెనాల్టీ చెల్లించనున్నట్లు సంస్థ తెలిపింది.