ఎస్‌బీఐ వడ్డీ మార్జిన్ 0.14 శాతం పెరగొచ్చు
ముంబై: సేవింగ్ అకౌంట్ డిపాజిట్‌పై వడ్డీరేటు తగ్గింపు వల్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నికర వడ్డీ మార్జిన్ (ఎన్‌ఐఎం) 14 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) మేర పెరిగే అవకాశం కనబడుతోందని ఆంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణా సంస్థ– మోర్గాన్ స్టాన్లీ మంగళవారం తన తాజా నివేదికలో అంచనావేసింది.
ఇతర బ్యాంకులూ ఎస్‌బీఐ బాటను అనుసరించే అవకాశం ఉందనీ, దీనివల్ల నికర వడ్డీ మార్జిన్లు 0.05 శాతం నుంచి 0.15 శాతం శ్రేణిలో పెరిగే వీలుందని నివేదిక విశ్లేషించింది. ఆరేళ్లలో మొట్టమొదటిసారి తన పొదుపు ఖాతాలపై లభించే వడ్డీరేటును ఎస్‌బీఐ అరశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 3.5 శాతానికి తగ్గింది.