
ముద్రా రుణ లక్ష్యం రూ.1.22 లక్షల కోట్లు
♦ ఇప్పటి వరకూ రూ.24 వేల కోట్ల రుణ పంపిణీ
♦ మెగా రుణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆర్థికమంత్రి జైట్లీ
న్యూఢిల్లీ : చిన్న మధ్య తరహా వ్యాపారాలకు ప్రధానమంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి (మార్చి 2016) రూ.1.22 లక్షల కోట్ల రుణ పంపిణీ లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుంది. ప్రధాని నరేంద్రమోదీ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించిన నాటి నుంచి ఈ యోజన కింద ఇప్పటికి 37 లక్షల మంది చిన్న వ్యాపారస్తులకు దాదాపు రూ.24,000 కోట్ల రుణ పంపిణీ జరిగింది. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఈ విషయాలను వెల్లడించారు. ఈ రుణ పంపిణీ ద్వారా లక్షలాది ఉపాధి అవకాశాలు సృష్టించాలన్నది కేంద్రం ప్రధాన లక్ష్యమని వివరించారు.
దీనదయాళ్ ఉపాధ్యాయ 99వ జయంతిని పురస్కరించుకుని పీఎంఎంవై కింద వారం రోజుల మెగా రుణ కార్యక్రమాన్ని అరుణ్‌జైట్లీ శుక్రవారం ప్రారంభించారు. రుణం సౌలభ్యం అందక ఇబ్బంది పడుతున్న చిన్న పరిశ్రమలకు చేయూతను ఇవ్వడానికి ముద్రా (చిన్న పరిశ్రమల అభివృద్ధి, రీఫైనాన్స్ సంస్థ) యోజన ఆవిష్కరణ జరిగింది. నేటి నుంచీ వారం రోజుల పాటు దేశ వ్యాప్తంగా పలు బ్యాంకులు ఈ రుణ పంపిణీకి సంబంధించి మెగా క్యాంప్‌ను నిర్వహించనున్నాయి.
తగిన వడ్డీరేటుకు రుణం అందుకోవడం ద్వారా చిన్న తరహా వ్యాపారస్తులు స్వయం సంపదను ఆర్జించడానికి ఈ పథకం దోహదపడుతుందని జైట్లీ ఈ సందర్భంగా పేర్కొన్నారు ముద్రా పథకం కింద 1.75 కోట్ల చిన్న వ్యాపారులకు రుణం అందజేయాలన్నది కేంద్ర లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి పలువురు వ్యాపారస్తులకు రుణ మంజూరీ లేఖలను అందజేశారు. శిశు (రూ.50,000 వరకూ) కిశోర్ (రూ.50,000-రూ.5 లక్షల వరకూ), తరుణ్ (రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ) పేర్లతో మూడు కేటగిరీల కింద ముద్రా యోజన కింద రుణాలు మంజూరవుతాయి. కాగా, ఇప్పటికి ముద్రా కార్యక్రమం కింద 1.24 లక్షల కొత్త అకౌంట్లు ప్రారంభించి... రూ.938 కోట్ల రుణ పంపిణీ జరిపినట్లు పీఎన్‌బీ ఎండీ ఉషాసుబ్రమణ్యం తెలిపారు.