ఎప్పుడైనా, ఎక్కడైనా బిల్లులు చెల్లించొచ్చు!
ముంబై: స్కూలు ఫీజుల నుంచి మున్సిపాలిటీ పన్నులు, కరెంటు బిల్లుల వరకు అన్నీ ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా చెల్లించే విధంగా సమగ్ర వ్యవస్థ ఏర్పాటుకు రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదించింది. రిటైల్ చెల్లింపుల లావాదేవీల్లో బిల్లులదే అధిక వాటా. దేశవ్యాప్తంగా 20 ప్రధాన నగరాల్లో ఏటా ఆరు లక్షల కోట్ల రూపాయలను ప్రజలు 3,080 కోట్ల బిల్లుల ద్వారా చెల్లిస్తున్నారు. వివిధ పద్ధతుల్లో చెల్లింపులను స్వీరిస్తున్నప్పటికీ నగదు, చెక్కుల రూపంలో చేసే చెల్లింపులే అధికం.
వీటిని కూడా బిల్లును వసూలు చేసే వారి కలెక్షన్ పాయింట్లలో చెల్లిస్తుంటారు. ఈ నేపథ్యంలో భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్(బీబీపీఎస్) స్థాపనకు రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదించింది. నగదు, చెక్కుల వంటి ఎలాంటి చెల్లింపులనైనా స్వీకరించి, చెల్లింపు ధ్రువీకరణ పత్రాన్ని తక్షణమే అందించేలా ఏజెంట్ల నెట్‌వర్క్‌తో కూడిన వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే బీబీపీఎస్ ఉద్దేశం. ఎక్కడైనా ఎప్పుడైనా చెల్లింపులు చేసే సౌకర్యం బీబీపీఎస్‌తో సాధ్యమవుతుందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.
ఏఆర్‌సీలకు సీఐసీల్లో సభ్యత్వం ఉండాల్సిందే
ఆస్తుల పునర్వ్యవస్థీకరణ కంపెనీలు(ఏఆర్‌సీలు) కనీసం ఒక రుణ సమాచార కంపెనీ(సీఐసీ)లో సభ్యత్వం తీసుకుని, రుణ గ్రహీతల గణాంకాలను నిర్దిష్ట కాల వ్యవధుల్లో నివేదించాలని ఆర్‌బీఐ గురువారం ఆదేశించింది. ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టిన వారి ఖాతాల వివరాలను ఏఆర్‌సీలు, సెక్యూరిటైజేషన్ కంపెనీలు 3 నెలలకోసారి వెబ్‌సైట్లలో ఉంచాలని కూడా ఆర్‌బీఐ పేర్కొంది.