మ్యూచువల్ ఫండ్స్ నుంచి త్వరలో12 కొత్త పథకాలు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతుండడంతో దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు పలు సంస్థలు సైతం అడుగులు వేస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 12 కొత్త పథకాలకు(ఎన్‌ఎఫ్‌ఓ) సంబంధించి అనుమతులు కోరుతూ వివిధ మ్యూచువల్ ఫండ్ సంస్థలు సెబీ వద్ద దరఖాస్తు చేశాయి. వీటిలో ఈక్విటీ, డెట్, ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్లు ఉన్నాయి. సుందరం, ఎడెల్వీజ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, రిలయన్స్, డీఎస్పీ బ్లాక్‌రాక్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐడీఎఫ్‌సీ సంస్థలు నూతన పథకాలను తీసుకురానున్నాయి. సెబీ అనుమతులు ఇచ్చిన వెంటనే ఈ పథకాలకు సంబంధించి చందాలను ఫండ్ సంస్థలు స్వీకరిస్తాయి.
ఇటీవల వచ్చిన కొత్త పథకాల పట్ల ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన రావడంతో ఫండ్ సంస్థలు కొత్త పథకాలను తీసుకురావడంలో మరింతగా తలమునకలై ఉన్నట్టు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది తాము రిటైల్ ఇన్వెస్టర్లపై మరింత దృష్టి సారించనున్నట్టు క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో) జిమ్మీ పటేల్ తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్ నమోదుకు పేపర్ రహిత ఆన్‌లైన్ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించడం సైతం ఈ రంగానికి కలసివస్తుందన్నారు. గతేడాది మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు సెబీ వద్ద మొత్తం 106 పథకాలకు సంబంధించి దరఖాస్తులు దాఖలు చేశాయి.