
న్యూఢిల్లీ: నాబార్డ్ (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్) మూలధనాన్ని రూ.5,000 కోట్ల నుంచి రూ.30,000 కోట్లకు పెంచడానికి వీలుకల్పిస్తున్న బిల్లుకు గురువారం పార్లమెంటు ఆమోదముద్ర వేసింది. ఇంతకన్నా ఎక్కువ అవసరం అయితే, ఆర్‌బీఐతో సంప్రదింపుల ద్వారా కేంద్రం ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకునే వీలుంటుంది. ‘‘2017 స్థానంలో 2018’’ని చేరుస్తూ సవరించిన బిల్లును మంగళవారం రాజ్యసభ ఆమోదించగా... గురువారం లోక్‌సభ కూడా ఆమోదించింది. దీంతో బిల్లును పార్లమెంటు ఆమోదించినట్లయ్యింది.
దివాలా బిల్లుకూ ఆమోదం...
‘‘2017 స్థానంలో 2018’’ని చేరుస్తూ రాజ్యసభ ఆమోదించిన దివాలా సవరణ బిల్లును కూడా లోక్‌సభ ఆమోదించింది. దివాలా ప్రొసీడింగ్స్ ద్వారా మొండి బకాయిల (ఎన్‌పీఏ) రికవరీకి సంబంధించిన వేలంలో ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, ఎన్‌పీఏ అకౌంట్ హోల్డర్లు బిడ్డింగ్ వేయకుండా నిరోధించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి. అయితే ఆయా వ్యక్తులు తమ బకాయిలన్నింటినీ వడ్డీలు, చార్జీలతో సహా చెల్లించేసినట్లయితే, వారు బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అర్హులవుతారు.
Comments
Please login to add a commentAdd a comment