
వినియోగదారుల నమ్మకం ఉంటేనే పురోగతి
కంపెనీల వ్యాపారాభివృద్ధిపై ఇన్ఫీ నారాయణ మూర్తి వ్యాఖ్య
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపారాభివృద్ధికి కేవలం లాభాలే ప్రాతిపదిక కాదని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి పేర్కొన్నారు. వినియోగదారుల నమ్మకం చూరగొని, ఉద్యోగులతో సఖ్యతగా మెలిగే యాజమాన్యం ఉన్న కంపెనీలే రాణించగలవని ఆయన తెలిపారు. మంగళవారం ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లో డీ న్స్ స్పీకర్ సిరీస్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నారాయణ మూర్తి ఈ విషయాలు వివరించారు. ఇన్ఫోసిస్ ప్రస్థానాన్ని ఆయన ఉటంకించారు.
ప్రారంభం నుంచి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా విలువల తో కూడిన వ్యాపారం, ఉద్యోగుల, సిబ్బంది పట్ల గౌరవ భావం, కష్టమర్లతో నమ్మ కాన్ని పెంపొందించుకోవడంతోనే అభివృద్ధి సాధ్యమైందన్నారు. ప్రపంచ స్థాయి పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటే భారతీయులు అంతర్జాతీయంగా రాణించవచ్చని నారాయణ మూర్తి సూచించారు. అటు ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రశంసించారు. మరోవైపు, నారాయణ మూర్తిని ఐఎస్‌బీ ఆనరరీ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్‌తో సత్కరించింది. దీన్ని ఏర్పాటు చేశాక తొలిసారి అందుకున్నది ఆయనే. తమ తమ రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించి, జాతీయ.. అంతర్జాతీయ స్థాయి లో స్ఫూర్తిగా నిలుస్తున్న ప్రముఖులకు దీన్ని అందజేస్తున్నట్లు ఐఎస్‌బీ డీన్ రాజేంద్ర శ్రీవాస్తవ తెలిపారు.