ఈసారి రూ. 260 కోట్ల పెట్టుబడులు
నాట్కో ఫార్మా వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం నాట్కో ఫార్మా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కార్యకలాపాలపై దాదాపు రూ. 260 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఇప్పటికే ప్రథమార్ధంలో సుమారు రూ. 111 కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్లు ఇన్వెస్టర్లతో సమావేశంలో కంపెనీ వీసీ రాజీవ్ నన్నపనేని వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా మరికొన్ని ఔషధాలకు సంబంధించి 6-7 దరఖాస్తులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే సుమారు నాలుగు ఔషధాల కోసం దరఖాస్తులు చేసినట్లు పేర్కొన్నారు. వైజాగ్‌లో ఫార్ములేషన్‌స ప్లాంటు వచ్చే ఏడాది మార్చి నాటికి అందుబాటులోకి రాగలదని భావిస్తున్నామని, ఆ తర్వాత ఫైలింగ్‌స సంఖ్య ఏటా 10కి పైగా పెరగవచ్చని తెలిపారు.
ప్రస్తుతం ఏటా రూ. 30-40 కోట్లుగా ఉన్న హెపటైటిస్ సీ చికిత్స ఔషధ ఎగుమతులు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రూ. 100 కోట్లకు చేరగలవని అంచనా వేస్తున్నట్లు రాజీవ్ చెప్పారు. వియత్నాం, ఇండొనేషియాలో విక్రయాలకు సంబంధించి ఆయా దేశాల నుంచి వచ్చే ఏడాది అనుమతులు లభించగలవని తెలిపారు. డీమానిటైజేషన్ (పెద్ద నోట్ల రద్దు) పర్యవసానాలు వచ్చే నెలలో కూడా కొనసాగిన పక్షంలో దేశీయంగా అమ్మకాలపై కొంత మేర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని రాజీవ్ తెలిపారు. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో నాట్కో ఫార్మా ఆదాయం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 243 కోట్ల నుంచి రూ. 467 కోట్లకు, లాభం రూ. 30 కోట్ల నుంచి రూ. 66 కోట్లకు పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు.