NATO Pharma
-
ఈసారి రూ. 260 కోట్ల పెట్టుబడులు
నాట్కో ఫార్మా వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం నాట్కో ఫార్మా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కార్యకలాపాలపై దాదాపు రూ. 260 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఇప్పటికే ప్రథమార్ధంలో సుమారు రూ. 111 కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్లు ఇన్వెస్టర్లతో సమావేశంలో కంపెనీ వీసీ రాజీవ్ నన్నపనేని వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా మరికొన్ని ఔషధాలకు సంబంధించి 6-7 దరఖాస్తులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే సుమారు నాలుగు ఔషధాల కోసం దరఖాస్తులు చేసినట్లు పేర్కొన్నారు. వైజాగ్‌లో ఫార్ములేషన్‌స ప్లాంటు వచ్చే ఏడాది మార్చి నాటికి అందుబాటులోకి రాగలదని భావిస్తున్నామని, ఆ తర్వాత ఫైలింగ్‌స సంఖ్య ఏటా 10కి పైగా పెరగవచ్చని తెలిపారు. ప్రస్తుతం ఏటా రూ. 30-40 కోట్లుగా ఉన్న హెపటైటిస్ సీ చికిత్స ఔషధ ఎగుమతులు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రూ. 100 కోట్లకు చేరగలవని అంచనా వేస్తున్నట్లు రాజీవ్ చెప్పారు. వియత్నాం, ఇండొనేషియాలో విక్రయాలకు సంబంధించి ఆయా దేశాల నుంచి వచ్చే ఏడాది అనుమతులు లభించగలవని తెలిపారు. డీమానిటైజేషన్ (పెద్ద నోట్ల రద్దు) పర్యవసానాలు వచ్చే నెలలో కూడా కొనసాగిన పక్షంలో దేశీయంగా అమ్మకాలపై కొంత మేర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని రాజీవ్ తెలిపారు. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో నాట్కో ఫార్మా ఆదాయం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 243 కోట్ల నుంచి రూ. 467 కోట్లకు, లాభం రూ. 30 కోట్ల నుంచి రూ. 66 కోట్లకు పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు. -
కొపాక్జోన్పై మైలాన్‌కు అనుకూలంగా ఆదేశాలు
నాట్కో ఫార్మా వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొపాక్జోన్ ఔషధానికి సంబంధించి మరో పేటెంట్ విషయంలో నాట్కో ఫార్మా మార్కెటింగ్ భాగస్వామి మైలాన్‌కు అనుకూలంగా ఆదేశాలు వెలువడ్డాయి. దీనిపై ఇజ్రాయెల్‌కు చెందిన తెవా ఫార్మాకు ఉన్న మూడో పేటెంటు చెల్లనేరదని అమెరికా పేటెంట్ అండ్ ట్రేడ్‌మార్క్ ఆఫీస్ (పీటీవో) ఆదేశాలిచ్చిందని నాట్కో తెలిపింది. కేంద్ర నాడీ మండల వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే మల్టిపుల్ స్లెరోసిస్ చికిత్సలో 20, 40 మి.గ్రా./మి.లీ. మోతాదుల్లో కొపాక్జోన్ (గ్లాటిరామెర్ ఎసిటేట్ ఇంజెక్షన్)ను ఉపయోగిస్తారు. ఈ ఔషధ పేటెంట్ హక్కులున్న యెడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ వీటి లెసైన్సును తెవా ఫార్మాకి ఇచ్చింది. తాజాగా 40 మి.గ్రా. మోతాదులో జనరిక్ వెర్షన్ తయారీ దిశగా నాట్కో, మైలాన్ ఈ పేటెంట్లను సవాలు చేశాయి. ఇరు సంస్థల ఒప్పందం ప్రకారం నాట్కో ఈ ఔషధాన్ని సరఫరా చేస్తే.. అమెరికాలో మైలాన్ మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే రెండు పేటెంట్ల విషయంలో మైలాన్‌కు సానుకూలంగా ఉత్తర్వులు రాగా.. మూడో పేటెంటుపైనా తాజాగా ఆదేశాలు వచ్చాయి. అమెరికా మార్కెట్లో కొపాక్జోన్ 40 మి.గ్రా. అమ్మకాలు జూన్‌తో ముగిసిన ఏడాది కాలంలో 3.3 బిలియన్ డాలర్ల మేర నమోదయ్యాయి. శుక్రవారం బీఎస్ఈలో నాట్కో ఫార్మా స్వల్పంగా లాభపడి రూ. 680 వద్ద ముగిసింది. -
అమెరికాలో క్యాన్సర్ ఔషధ విక్రయానికి మైలాన్ కు అనుమతి
న్యూఢిల్లీ: అమెరికా మార్కెట్లో క్యాన్సర్ నియంత్రణకు ఉపయోగించే ట్యాబ్లెట్స్ విక్రయానికి గానూ నాట్కో ఫార్మా మార్కెటింగ్ భాగస్వామి ‘మైలాన్’కు.. అమెరికా హెల్త్ రెగ్యులేటర్ యూఎస్ఎఫ్డీఏ నుంచి తాత్కాలిక అనుమతి లభించింది. క్యాన్సర్ నియంత్రణకు వినియోగించే సోర ఫెబిన్ ట్యాబ్లెట్స్ విక్రయానికి అమెరికా ఎఫ్‌డీఏ అనుమతి లభించిందని నాట్కో ఫార్మా శుక్రవారం బీఎస్ఈకి నివేదించింది. తెలంగాణలోని కొత్తూర్ ఫెసిలిటీలో ఈ ట్యాబ్లెట్ల తయారీ జరుగుతుందని పేర్కొంది. బేయర్ హెల్త్‌కేర్ ఎల్ఎల్సీ, బేయర్ హెల్త్‌కేర్ ఫార్మా, ఓనీక్స్ ఫార్మా కంపెనీలు ఈ సోరఫెబిన్ ట్లాబ్లెట్స్ను ‘నెక్జావర్’ బ్రాండ్ కింద అమెరికా మార్కెట్లో విక్రయిస్తాయని వివరించింది. ఈ నేపథ్యంలో నాట్కో ఫార్మా షేరు ధర శుక్రవారం బీఎస్ఈలో 9 శాతం బలపడి రూ.518 వద్ద ముగిసింది. -
షేర్ల విభజనకు నాట్కో ఆమోదం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాట్కో ఫార్మా ద్వితీయ త్రైమాసిక ఆదాయం పెరిగినా, నికర లాభంలో స్వల్ప క్షీణత నమోదయ్యింది. ఈ మూడు నెలల కాలానికి రూ. 205 కోట్ల ఆదాయంపై (స్టాండ్ ఎలోన్) రూ. 34.6 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. దేశీయ మార్కెట్లో అమ్మకాలు బాగున్నా.. ఉత్తర అమెరికా ఎగుమతులు ఆలస్యం కావడం లాభాలు తగ్గడానికి కారణంగా కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. గతేడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 194 కోట్ల ఆదాయంపై రూ. 34.8 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. సమీక్షా కాలంలో కన్సాలిడేటెడ్ లాభం రూ. 32 కోట్ల నుంచి రూ. 30 కోట్లకు తగ్గింది. రానున్న త్రైమాసికాల్లో లాభాలు పెరుగుతాయన్న ఆశాభావాన్ని కంపెనీ వ్యక్తం చేసింది. రూ. 10 ముఖ విలువ కలిగిన షేరును రూ.2గా విభజించడానికి శుక్రవారం సమావేశమైన బోర్డు ఆమోదం తెలిపింది. దీనికి రికార్డు తేదీ నవంబర్ 28గా నిర్ణయించారు. దీని ప్రకారం నవంబర్ 28 నాటికి షేర్లు కలిగిన వాటాదారులకు ప్రతీషేరుకు 5 షేర్లు వస్తాయి.