అమెరికాలో క్యాన్సర్ ఔషధ విక్రయానికి మైలాన్ కు అనుమతి
న్యూఢిల్లీ: అమెరికా మార్కెట్‌లో క్యాన్సర్ నియంత్రణకు ఉపయోగించే ట్యాబ్లెట్స్ విక్రయానికి గానూ నాట్కో ఫార్మా మార్కెటింగ్ భాగస్వామి ‘మైలాన్’కు.. అమెరికా హెల్త్ రెగ్యులేటర్ యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి తాత్కాలిక అనుమతి లభించింది. క్యాన్సర్ నియంత్రణకు వినియోగించే సోర ఫెబిన్ ట్యాబ్లెట్స్ విక్రయానికి అమెరికా ఎఫ్‌డీఏ అనుమతి లభించిందని నాట్కో ఫార్మా శుక్రవారం బీఎస్‌ఈకి నివేదించింది. తెలంగాణలోని కొత్తూర్ ఫెసిలిటీలో ఈ ట్యాబ్లెట్ల తయారీ జరుగుతుందని పేర్కొంది. బేయర్ హెల్త్‌కేర్ ఎల్‌ఎల్‌సీ, బేయర్ హెల్త్‌కేర్ ఫార్మా, ఓనీక్స్ ఫార్మా కంపెనీలు ఈ సోరఫెబిన్ ట్లాబ్లెట్స్‌ను ‘నెక్జావర్’ బ్రాండ్ కింద అమెరికా మార్కెట్‌లో విక్రయిస్తాయని వివరించింది. ఈ నేపథ్యంలో నాట్కో ఫార్మా షేరు ధర శుక్రవారం బీఎస్‌ఈలో 9 శాతం బలపడి రూ.518 వద్ద ముగిసింది.