Mylan
-
‘మ్యాట్రిక్స్’ ప్రసాద్ రీఎంట్రీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిమ్మగడ్డ ప్రసాద్.. మ్యాట్రిక్స్ ప్రసాద్‌గా తెలుగు ప్రజలకు సుపరిచితమైన ప్రముఖ వ్యాపారవేత్త. ఖాయిలాపడ్డ మ్యాట్రిక్స్ ల్యా»ొరేటరీస్ను 2000 సంవత్సరంలో ఆయన కొనుగోలు చేశారు. ఆరేళ్లలోనే బిలియన్ డాలర్ కంపెనీగా తీర్చిదిద్దారు. అప్పట్లో స్టాక్మార్కెట్లో మ్యాట్రిక్స్ ఓ సంచలనం. కంపెనీ షేర్లను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిపై ఇబ్బడిముబ్బడిగా లాభాలు గడించారు. ఫార్మా దిగ్గజం మైలాన్ ల్యాబ్స్ 2006లో మ్యాట్రిక్స్‌ను 1.1 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ డీల్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పరిచయం ఎందుకంటే తాను ఏ అమెరికా కంపెనీకి అయితే 17 ఏళ్ల క్రితం మ్యాట్రిక్స్‌ను విక్రయించారో.. ఇప్పుడు అదే మైలాన్ (ప్రస్తుతం వియాట్రిస్) నుంచి నిమ్మగడ్డ ప్రసాద్ తిరిగి ఆ వ్యాపారాన్ని కైవసం చేసుకుంటున్నారు. వియాట్రిస్‌కు చెందిన భారత ఏపీఐ వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి నిమ్మగడ్డ ప్రసాద్ ప్రమోట్ చేస్తున్న ఐక్వెస్ట్ ఎంటర్ప్రైసెస్ తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. అంతర్జాతీయంగా పోటీపడి మరీ టెండర్లలో విజయం సాధించి వియాట్రిస్ ప్లాంట్లను ఐక్వెస్ట్ చేజిక్కించుకుంటోంది. ఏటా రూ.6,000 కోట్లు.. తాజా డీల్ పూర్తి అయితే హైదరాబాద్‌లో మూడు, ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో మూడు భారీ స్థాయి యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్ (ఏపీఐ) తయారీ ప్లాంట్లతోపాటు హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఐక్వెస్ట్ చేతికి రానున్నాయి. అలాగే థర్డ్–పార్టీ ఏపీఐ విక్రయాలు కూడా సంస్థ పరం కానున్నాయి. ఈ డీల్ పూర్తి కావడానికి ఆరు నెలల సమయం పట్టొచ్చని అంచనా. ఆరు ప్లాంట్ల వార్షికాదాయం సుమారు రూ.6,000 కోట్లు ఉంది. ఈ ప్లాంట్లలో తయారైన ఉత్పత్తులను 10 ఏళ్లపాటు కొనుగోలు చేసేందుకు వియాట్రిస్ అంగీకరించింది. రానున్న రోజుల్లో హైదరాబాద్ కేంద్రంగా పెద్ద ఫార్మా కంపెనీగా ఆవిర్భవించనున్నట్టు ఐక్వెస్ట్ తెలిపింది. కాగా, భారత్‌లో మహిళల ఆరోగ్య సేవల వ్యాపారాన్ని స్పెయిన్‌కు చెందిన ఇన్సడ్ ఫార్మాకు వియాట్రిస్ విక్రయిస్తోంది. ఐక్వెస్ట్, ఇన్సడ్ డీల్స్ ద్వారా వియాట్రిస్‌కు సుమారు రూ.10,000 కోట్లు సమకూరుతున్నాయి. రుణ భారాన్ని తగ్గించుకోవడానికి వియాట్రిస్ అంతర్జాతీయంగా వివిధ విభాగాల్లో వాటాల విక్రయం ద్వారా దాదాపు రూ.29,950 కోట్లు అందుకుంటోంది. ఇదే అతిపెద్ద పెట్టుబడి.. ఫార్మాస్యూటికల్ రంగంలో తమ కంపెనీ నుంచి ఇదే అతిపెద్ద పెట్టుబడి అని ఐక్వెస్ట్ ఎంటర్ప్రైసెస్ ఈడీ, నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె గునుపాటి స్వాతి రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ప్రపంచ ఔషధ పరిశ్రమలో భారత్ గణనీయంగా దృష్టిని ఆకర్షిస్తున్న సరైన సమయంలో ఈ డీల్ కుదుర్చుకున్నట్టు చెప్పారు. కాగా, ఏఐజీ హాస్పిటల్స్, కేర్ హాస్పిటల్స్, సెలాన్ లే»ొరేటరీస్ తదితర సంస్థల్లో ఐక్వెస్ట్ ద్వారా నిమ్మగడ్డ ప్రసాద్ గతంలో పెట్టుబడులు పెట్టి వీటి అభివృద్ధిలో పాలుపంచుకున్నారు. సృజనాత్మక ఆలోచనలను విజయవంతమైన వ్యాపార వ్యూహాలుగా మార్చారు. కంపెనీలను వృద్ధి బాటలో నడిపించడంతోపాటు వాటాదారులకు మెరుగైన విలువను సృష్టించారు. 2012లో కేర్ హాస్పిటల్స్‌లో, 2015లో మా టీవీలో తనకున్న వాటాలను విక్రయించారు. మా టీవీని స్టార్ టీవీ సుమారు రూ.2,350 కోట్లకు కొనుగోలు చేయడం అప్పట్లో మీడియా రంగంలో సంచలనం కలిగించింది. -
సంగారెడ్డి : మైలాన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
-
మైలాన్ రెమ్‌డెసివిర్ వచ్చేసింది
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 చికిత్సలో ఉపయోగించే రెమ్‌డెసివిర్ ఔషధాన్ని అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం మైలాన్ భారత్‌లో అందుబాటులోకి తెచ్చింది. డెస్రెమ్ పేరుతో కంపెనీ ఈ జనరిక్ వర్షన్‌ను రూపొందించింది. 100 ఎంజీ వయల్‌ను రూ.4,800లకు విక్రయించనున్నట్టు మైలాన్ ఇప్పటికే ప్రకటించింది. పిల్లలు, పెద్దల్లో కోవిడ్ అనుమానిత, నిర్ధారిత కేసులు, తీవ్ర లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరిన వారికి చికిత్సలో భాగంగా పరిశోధనాత్మక యాంటీ వైరల్ డ్రగ్‌గా రెమ్‌డెసివిర్‌ను ఉపయోగించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి మంజూరు చేసింది. తొలి బ్యాచ్ వయల్స్‌ను ఇప్పటికే మార్కెట్లోకి ప్రవేశపెట్టామని.. ఈ ఔషధానికి డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా సరఫరాను పెంచుతామని కంపెనీ ఇండియా, ఎమర్జింగ్ మార్కెట్స్ ప్రెసిడెంట్ రాకేశ్ బమ్జాయ్ వెల్లడించారు. ఔషధం సరఫరా వివరాల కోసం హెల్ప్‌లైన్ నంబరును సైతం కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. బెంగళూరులోని ఇంజెక్టేబుల్ ఫెసిలిటీలో డెస్‌రెమ్‌ను మైలాన్ తయారు చేస్తోంది. ఈ ఔషధాన్ని ఇతర దేశాలకూ ఎగుమతి చేయనున్నట్టు సంస్థ తెలిపింది. రెమ్‌డెసివిర్ తయారీ, పంపిణీకై ఈ ఏడాది మే నెలలో యూఎస్‌కు చెందిన గిలియడ్ సైన్సెస్‌తో నాన్ ఎక్స్‌క్లూజివ్ లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల్లో మైలాన్ కూడా ఉంది. హెటిరో, సిప్లా ఇప్పటికే రెమ్‌డెసివిర్ ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చాయి. -
కొపాక్జోన్పై మైలాన్‌కు అనుకూలంగా ఆదేశాలు
నాట్కో ఫార్మా వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొపాక్జోన్ ఔషధానికి సంబంధించి మరో పేటెంట్ విషయంలో నాట్కో ఫార్మా మార్కెటింగ్ భాగస్వామి మైలాన్‌కు అనుకూలంగా ఆదేశాలు వెలువడ్డాయి. దీనిపై ఇజ్రాయెల్‌కు చెందిన తెవా ఫార్మాకు ఉన్న మూడో పేటెంటు చెల్లనేరదని అమెరికా పేటెంట్ అండ్ ట్రేడ్‌మార్క్ ఆఫీస్ (పీటీవో) ఆదేశాలిచ్చిందని నాట్కో తెలిపింది. కేంద్ర నాడీ మండల వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే మల్టిపుల్ స్లెరోసిస్ చికిత్సలో 20, 40 మి.గ్రా./మి.లీ. మోతాదుల్లో కొపాక్జోన్ (గ్లాటిరామెర్ ఎసిటేట్ ఇంజెక్షన్)ను ఉపయోగిస్తారు. ఈ ఔషధ పేటెంట్ హక్కులున్న యెడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ వీటి లెసైన్సును తెవా ఫార్మాకి ఇచ్చింది. తాజాగా 40 మి.గ్రా. మోతాదులో జనరిక్ వెర్షన్ తయారీ దిశగా నాట్కో, మైలాన్ ఈ పేటెంట్లను సవాలు చేశాయి. ఇరు సంస్థల ఒప్పందం ప్రకారం నాట్కో ఈ ఔషధాన్ని సరఫరా చేస్తే.. అమెరికాలో మైలాన్ మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే రెండు పేటెంట్ల విషయంలో మైలాన్‌కు సానుకూలంగా ఉత్తర్వులు రాగా.. మూడో పేటెంటుపైనా తాజాగా ఆదేశాలు వచ్చాయి. అమెరికా మార్కెట్లో కొపాక్జోన్ 40 మి.గ్రా. అమ్మకాలు జూన్‌తో ముగిసిన ఏడాది కాలంలో 3.3 బిలియన్ డాలర్ల మేర నమోదయ్యాయి. శుక్రవారం బీఎస్ఈలో నాట్కో ఫార్మా స్వల్పంగా లాభపడి రూ. 680 వద్ద ముగిసింది. -
కొపాక్జోన్ పేటెంటుపై మైలాన్‌కు ఊరట
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొపాక్జోన్ ఔషధ పేటెంట్లకు సంబంధించి తెవా ఫార్మాస్యూటికల్స్‌తో వివాదంలో మైలాన్‌కు ఊరట లభించింది. ఈ ఔషధం 40 మి.గ్రా.ల మోతాదుకు సంబంధించి తెవాకు ఉన్న పేటెంట్లలో రెండు చెల్లవంటూ తమ భాగస్వామ్య సంస్థ మైలాన్‌కు అనుకూలంగా అమెరికా పేటెంట్ అండ్ ట్రేడ్‌మార్క్ ఆఫీస్ (పీటీవో) ఆదేశాలిచ్చిందని నాట్కో ఫార్మా వెల్లడించింది. మూడో పేటెంటుపై సెప్టెంబర్ 1 లోగా ఆదేశాలు రావొచ్చని పేర్కొంది. కేంద్ర నాడీమండల వ్యవస్థపై ప్రభావం చూపే మల్టిపుల్ స్లెరోసిస్ చికిత్సలో 20, 40 మి.గ్రా./మి.లీ. మోతాదుల్లో కొపాక్జోన్ (గ్లాటిరామెర్ ఎసిటేట్ ఇంజెక్షన్)ను ఉపయోగిస్తారు. ఈ ఔషధ జనరిక్ వెర్షన్ తయారీ, విక్రయాల కోసం నాట్కో, మైలాన్ కలిసి వీటి పేటెంట్లను సవాలు చేశాయి. ఒప్పందం ప్రకారం నాట్కో వీటిని సరఫరా చేస్తే.. అమెరికాలో మైలాన్ మార్కెటింగ్ చేస్తుంది. లాభాలను రెండు సంస్థలు పంచుకుంటాయి. 20 మి.గ్రా. ఫార్ములేషన్‌పై పలు పేటెంట్ల గడువు ముగిసిపోగా జనరిక్ వెర్షన్ తయారీ కోసం నాట్కోకు ఇంకా అనుమతులు రావాల్సి ఉంది. తాజాగా 40 మి.గ్రా. మోతాదుకు సంబంధించి 2 పేటెంట్ల విషయంలో అనుకూల ఆదేశాలు లభించినందున.. మూడో పేటెంటు అంశంలోనూ సానుకూల స్పందన రాగలదని మైలాన్, నాట్కో భావిస్తున్నాయి. -
అమెరికాలో క్యాన్సర్ ఔషధ విక్రయానికి మైలాన్ కు అనుమతి
న్యూఢిల్లీ: అమెరికా మార్కెట్లో క్యాన్సర్ నియంత్రణకు ఉపయోగించే ట్యాబ్లెట్స్ విక్రయానికి గానూ నాట్కో ఫార్మా మార్కెటింగ్ భాగస్వామి ‘మైలాన్’కు.. అమెరికా హెల్త్ రెగ్యులేటర్ యూఎస్ఎఫ్డీఏ నుంచి తాత్కాలిక అనుమతి లభించింది. క్యాన్సర్ నియంత్రణకు వినియోగించే సోర ఫెబిన్ ట్యాబ్లెట్స్ విక్రయానికి అమెరికా ఎఫ్‌డీఏ అనుమతి లభించిందని నాట్కో ఫార్మా శుక్రవారం బీఎస్ఈకి నివేదించింది. తెలంగాణలోని కొత్తూర్ ఫెసిలిటీలో ఈ ట్యాబ్లెట్ల తయారీ జరుగుతుందని పేర్కొంది. బేయర్ హెల్త్‌కేర్ ఎల్ఎల్సీ, బేయర్ హెల్త్‌కేర్ ఫార్మా, ఓనీక్స్ ఫార్మా కంపెనీలు ఈ సోరఫెబిన్ ట్లాబ్లెట్స్ను ‘నెక్జావర్’ బ్రాండ్ కింద అమెరికా మార్కెట్లో విక్రయిస్తాయని వివరించింది. ఈ నేపథ్యంలో నాట్కో ఫార్మా షేరు ధర శుక్రవారం బీఎస్ఈలో 9 శాతం బలపడి రూ.518 వద్ద ముగిసింది. -
పేటెంట్ కేసులో డాక్టర్ రెడ్డీస్‌పై తెవా దావా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పేటెంట్ ఉల్లంఘన కేసులో డాక్టర్ రెడ్డీస్‌పై లా సూట్ వేసే ఆలోచనలో ఉన్నట్లు తెవా ఫార్మా ప్రకటించింది. కొపాగ్జోన్ జెనరిక్ వెర్షన్‌కు సంబంధించి డాక్టర్ రెడ్డీస్ నుంచి పారా-4 నోటిఫికేషన్ అందిందని, దీన్ని సవాలు చేస్తూ లా సూట్ దాఖలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెవా తెలిపింది. నాడీ వ్యవస్థ దెబ్బతిని వివిధ భాగాలు పనిచేయని వ్యాధి చికిత్సకు ఈ కొపాగ్జోన్ను వినియోగిస్తారు.