కొపాక్జోన్ పేటెంటుపై మైలాన్కు ఊరట
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొపాక్జోన్ ఔషధ పేటెంట్లకు సంబంధించి తెవా ఫార్మాస్యూటికల్స్‌తో వివాదంలో మైలాన్‌కు ఊరట లభించింది. ఈ ఔషధం 40 మి.గ్రా.ల మోతాదుకు సంబంధించి తెవాకు ఉన్న పేటెంట్లలో రెండు చెల్లవంటూ తమ భాగస్వామ్య సంస్థ మైలాన్‌కు అనుకూలంగా అమెరికా పేటెంట్ అండ్ ట్రేడ్‌మార్క్ ఆఫీస్ (పీటీవో) ఆదేశాలిచ్చిందని నాట్కో ఫార్మా వెల్లడించింది. మూడో పేటెంటుపై సెప్టెంబర్ 1 లోగా ఆదేశాలు రావొచ్చని పేర్కొంది. కేంద్ర నాడీమండల వ్యవస్థపై ప్రభావం చూపే మల్టిపుల్ స్లెరోసిస్ చికిత్సలో 20, 40 మి.గ్రా./మి.లీ. మోతాదుల్లో కొపాక్జోన్ (గ్లాటిరామెర్ ఎసిటేట్ ఇంజెక్షన్)ను ఉపయోగిస్తారు.
ఈ ఔషధ జనరిక్ వెర్షన్ తయారీ, విక్రయాల కోసం నాట్కో, మైలాన్ కలిసి వీటి పేటెంట్లను సవాలు చేశాయి. ఒప్పందం ప్రకారం నాట్కో వీటిని సరఫరా చేస్తే.. అమెరికాలో మైలాన్ మార్కెటింగ్ చేస్తుంది. లాభాలను రెండు సంస్థలు పంచుకుంటాయి. 20 మి.గ్రా. ఫార్ములేషన్‌పై పలు పేటెంట్ల గడువు ముగిసిపోగా జనరిక్ వెర్షన్ తయారీ కోసం నాట్కోకు ఇంకా అనుమతులు రావాల్సి ఉంది. తాజాగా 40 మి.గ్రా. మోతాదుకు సంబంధించి 2 పేటెంట్ల విషయంలో అనుకూల ఆదేశాలు లభించినందున.. మూడో పేటెంటు అంశంలోనూ సానుకూల స్పందన రాగలదని మైలాన్, నాట్కో భావిస్తున్నాయి.