సాక్షి, బెంగళూరు: భారతీయ రెండవ అతిపెద్ద ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ లిమిటెడ్ నుంచి మరో సీనియర్ పక్కకు తప్పుకున్నారు. ఇన్ఫీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, టెక్నాలజీ హెడ్ నవీన్ బుధిరాజా తన పదవికి రాజీనామా చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆర్కిటెక్చర్ అండ్ టెక్నాలజీ హెడ్ నవీన్ బుధి రాజ్ రిజైన్ చేశారు. దీంతో గత ఏడాది మార్చి తరువాత కంపెనీని వీడిన మాజీ సాప్‌ఎగ్జిక్యూటివ్‌ల సంఖ్య12కు చేరింది.
మరోవైపు బుధిరాజా నిష్క్రమణపై వ్యాఖ్యానించడానికి ఇన్ఫోసిస్ తిరస్కరించింది. కీలక నిర్వహణ సిబ్బంది రాజీనామా లేదా నియామకాలపై తాము వ్యాఖ్యానించలేమని ఇన్ఫోసిస్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. బుధిరాజా రాజీనామాతో సంస్థ కృత్రిమ మేధస్సు-ఆధారిత వేదిక, బుధిరాజా మానసపుత్రిక ఇన్ఫోసిస్ ‘నియా’ ప్లాన్లను ప్రభావితం చేస్తుందని ఇన్ఫోసిస్ మాజీ ఉద్యోగి అబ్దుల్ రజాక్ వ్యాఖ్యానించారు.
కాగా బుధిరాజా 2014, ఆగస్టులో ఇన్ఫోసిస్‌లో చేరారు. జర్మన్ సాఫ్ట్‌వేర్ జెయింట్ సాప్‌నుంచి దాదాపు 16మంది అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ,ఇతర సీనియర్ ర్యాంకులతో ఇన్ఫోసిస్‌లో చేరిన వారిలో ఈయన కూడా ఒకరు. ఇన్ఫీ మాజీ సీఈవో విశాల్ సిక్కాకు ప్రధాన అనుచరుడిగా బుధిరాజాను పేర్కొంటారు.