గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికం(జనవరి-మార్చి)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. మరోపక్క గత ఆర్థిక సంవత్సర పూర్తి ఫలితాలు నిరాశపరచినప్పటికీ పెట్టుబడుల బాటలో సాగనున్నట్లు తెలియజేయడంతో పీఎస్‌యూ దిగ్గజం హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్) కౌంటర్ సైతం జోరందుకుంది. వెరసి ఆటుపోట్ల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..
నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్ నికర లాభం 705 శాతం దూసుకెళ్లి రూ. 270 కోట్లను తాకింది. రూ. 88 కోట్లమేర కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్)లభించడంతో లాభాలు హైజంప్ చేసినట్లు నిపుణులు పేర్కొన్నారు. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర అమ్మకాలు 9 శాతం పెరిగి రూ. 277 కోట్లకు చేరాయి. ఇక ఇబిటా మార్జిన్లు 20 శాతం నుంచి దాదాపు 25 శాతానికి మెరుగుపడ్డాయి. వాటాదారులకు షేరుకి రూ. 3 డివిడెండ్ చెల్లించనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నవీన్ ఫ్లోరిన్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 3.5 శాతం పుంజుకుని రూ. 1615 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1655 వరకూ జంప్‌చేసింది.
హిందుస్తాన్ పెట్రోలియం
ఇంధన రంగ దిగ్గజం హెచ్‌పీసీఎల్ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21)లో రూ. 12,000 కోట్లమేర పెట్టుబడి వ్యయాల ప్రణాళికలను అమలు చేయనున్నట్లు తాజాగా తెలియజేసింది. ముంబై, వైజాగ్‌లలోని రిఫైనరీ విస్తరణ ప్రాజెక్టులు తుది దశకు చేరుకున్నట్లు కంపెనీ చైర్మన్ ముకేశ్ కుమార్ పేర్కొన్నారు. ఇతర పనుల కారణంగా బార్మర్ అభివృద్ధి ప్రాజెక్టుపై పెట్టుబడులను తదుపరి దశలో చేపట్టనున్నట్లు తెలియజేశారు. కాగా.. గతేడాది(2019-20)కి హెచ్‌పీసీఎల్ 50 శాతం తక్కువగా రూ. 2637 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం రూ. 6029 కోట్ల నికర లాభం నమోదైంది. తాజా ఫలితాలలో చమురు నిల్వలపై ఏర్పడిన నష్టాలు, ఫారెక్స్ హెచ్చుతగ్గులు లాభాలను ప్రభావితం చేసినట్లు కంపెనీ వెల్లడించింది. స్థూల అమ్మకాలు రూ. 2,95,713 కోట్ల నుంచి రూ. 2,86,250 కోట్లకు క్షీణించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హెచ్‌పీసీఎల్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 4 శాతం జంప్‌చేసి రూ. 218 వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment