
న్యూఢిల్లీ: హౌసింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ షేర్లు శుక్రవారం తీవ్రమైన నష్టాలకు గురయ్యాయి. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్(డీహెచ్‌ఎఫ్‌ఎల్) షేర్ 42 శాతం కుదేలైంది. ఈ కంపెనీ లిక్విడిటీ సంక్షోభంలోకి కూరుకుపోతుందనే వదంతులు ప్రతికూల ప్రభావం చూపించాయి. మరోవైపు బాండ్ల రాబడులు పెరుగుతుండటంతో ఎన్‌బీఎఫ్‌సీ షేర్లు కూడా క్షీణించాయి. మరోపక్క, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌లో కూడా లిక్విడిటీ సమస్యలు ఉన్నట్లు వార్తలు రావడంతో ఈ రంగం షేర్లపై తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి దారితీసింది.
అసలేం జరిగింది.. ?
డీహెచ్‌ఎఫ్‌ఎల్ వాణిజ్య పత్రాలను డీఎస్‌పీ మ్యూచువల్ ఫండ్ ఇటీవల విక్రయించింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌కు రూ. 350 కోట్ల మేర రుణాలిచ్చిన డీఎస్‌పీ మ్యూచువల్‌ఫండ్.. లిక్విడిటీని మెరుగుపరచుకోవడం కోసం రూ.200–300 కోట్ల విలువైన డీహెచ్‌ఎఫ్‌ఎల్ వాణిజ్య పత్రాలను 11 శాతం డిస్కౌంట్‌కు విక్రయించింది. దీంతో డీహెచ్‌ఎఫ్‌ఎల్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్ భారీ కుదుపులకు గురైంది.
బుధవారం రూ.610 వద్ద ముగిసిన ఈ షేర్ ఇంట్రాడేలో 60 శాతం నష్టంతో జీవిత కాల కనిష్ట స్థాయి, రూ.246కు పతనమైంది. చివరకు 42 శాతం నష్టంతో రూ.352 వద్ద ముగిసింది. కేవలం గంటల వ్యవధిలోనే ఈ షేర్ ధర సగమైంది. స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇంట్రాడేలో ఇంత అత్యధిక శాతం పతనమైన షేర్ ఇదే. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.8,120 కోట్లు ఆవిరై రూ.11,027 కోట్లకు పడిపోయింది. ఈ ప్రభావం ఇతర హౌసింగ్ ఫైనాన్స్ షేర్లపై తీవ్రంగానే పడింది.
ఇంట్రాడేలో పలు షేర్లు బహుళ సంవత్సరాల కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 8 శాతం, కెన్ ఫిన్ హోమ్స్ 5.7 శాతం, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 5 శాతం, పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ 5 శాతం మేర క్షీణించాయి. హౌసింగ్ ఫైనాన్స్‌కంపెనీల మాదిరే బ్యాంకేతర కంపెనీల షేర్లు కూడా కుదేలయ్యాయి. బజాజ్ ఫైనాన్స్ 4.5 శాతం, ఎడిల్‌వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 3.1 శాతం, శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ 2.4 శాతం చొప్పున నష్టపోయాయి.
కంపెనీ వివరణ...
డీహెచ్‌ఎఫ్‌ఎల్ కంపెనీ ఎలాంటి రుణ చెల్లింపుల్లో విఫలం కాలేదని డీహెచ్‌ఎఫ్‌ఎల్ సీఎమ్‌డీ కపిల్ వాధ్వాన్ స్పష్టం చేశారు. బాండ్ల తిరిగి చెల్లింపుల్లో కానీ, ఇతర రుణాల చెల్లింపుల్లో కానీ ఎలాంటి జాప్యం లేదని వివరించారు. అంతే కాకుండా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కంపెనీకి తాము ఎలాంటి రుణాలివ్వలేదని, ఎలాంటి వాణిజ్య సంబంధాలు లేవని పేర్కొన్నారు.
ఒక్క డీహెచ్‌ఎఫ్‌ఎల్ షేరే కాకుండా ఈ సెగ్మెంట్‌లోని ఇతర కంపెనీల షేర్లు కూడా పడిపోవడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమ కంపెనీ ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్నాయని, ఆరు నెలల నగదు నిల్వలకు సమానమైన రూ.10,000 కోట్ల నిధులు ప్రస్తుతం తమ వద్ద ఉన్నాయని వివరించారు. కంపెనీ ప్రమోటర్లు ఎవరూ తమ షేర్లను తనఖా పెట్టలేదని, కంపెనీ షేర్లు పెట్టి ఎవరూ రుణాలు తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు.
నిపుణులేమంటున్నారు...
నిధుల కటకట వదంతులతో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు భారీగా పతనమయ్యాయని శామ్‌కో సెక్యూరిటీస్ అండ్ స్టాక్ నోట్ సీఈఓ జిమీత్ మోదీ వ్యాఖ్యానించారు. ఫండమెంటల్స్ పరంగా ఈ కంపెనీలు పటిష్టంగా ఉన్నప్పటికీ, మూక మనస్తత్వంతో మూకుమ్మడి అమ్మకాలు జరిగాయని పేర్కొన్నారు. అయితే కనిష్ట స్థాయిల నుంచి ఈ షేర్లు కోలుకున్నాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment