సాక్షి, హైదరాబాద్: ల్యాంకో ఇన్‌ఫ్రాకు చెందిన ల్యాంకో బబంద్ పవర్ లిమిటెడ్ (ఎల్‌బీపీఎల్) దివాలా ప్రక్రియలో భాగంగా ఒడిశాలో ఉన్న ఆ కంపెనీ ఆస్తుల స్వాధీనానికి వెళ్లిన తనను స్థానిక కాంట్రాక్టర్లు అడ్డుకుంటున్నారని, తనకు తగిన రక్షణ కల్పించాలని కోరుతూ దివాలా పరిష్కార నిపుణుడు (ఆర్‌పీ) యు.బాలకృష్ణభట్ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్ బెంచ్‌ను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ జుడీషియల్ సభ్యుడు కె.అనంత పద్మనాభ స్వామి... బాలకృష్ణ భట్‌కు తగిన రక్షణ కల్పించాలంటూ ఒడిస్సా, డెంకనల్ జిల్లా కలెక్టర్, ఎస్‌పీలను ఆదేశించారు. ఎల్‌బీపీఎల్ ఆస్తుల స్వాధీనానికి వెళ్లినప్పుడు భట్‌కు తగిన రక్షణ కల్పించాలని స్వామి తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఎల్‌బీపీఎల్ తమకు రూ.1428.33 కోట్ల మేర బకాయి చెల్లించాల్సి ఉందని, అయితే ఆ బకాయిలను చెల్లించని నేపథ్యంలో ఆ కంపెనీ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ ఐసీఐసీఐ బ్యాంకు ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన ట్రైబ్యునల్... ల్యాంకో బబంద్ పవర్ లిమిటెడ్ దివాలా ప్రక్రియకు అనుమతులు మంజూరు చేసింది. పరిష్కార నిపుణుడిగా (ఆర్‌పీ) ముంబైకి చెందిన బాలకృష్ణ భట్‌ను నియమించింది. దివాలా ప్రక్రియలో భాగంగా ఆయన ఒడిశా, డెంకనల్ జిల్లా, కర్గప్రసాద్, కురుంటి గ్రామాల్లో ఎల్‌బీపీఎల్‌కు ఉన్న ఆస్తుల స్వాధీనానికి వెళ్లారు. అయితే ఆయనను స్థానికులు అడ్డుకున్నారు. చేసిన పనులకుగాను ల్యాంకో బబంద్ పవర్ లిమిటెడ్ స్థానిక కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు. దీంతో వారు వేరేవారెవ్వరినీ ఆ కంపెనీలోకి అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ భట్ ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్ దాఖలు చేశారు. ఆ కంపెనీ ప్లాంట్, యంత్ర సామాగ్రి, ఆస్తులు తదితర సామగ్రి విలువను మదింపు చేస్తే తప్ప దివాలా ప్రక్రియ ముందుకు సాగదని, అందువల్ల తనకు తగిన రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన ట్రిబ్యునల్‌ను కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ట్రిబ్యునల్, భట్ కోరిన ప్రకారం ఆదేశాలు జారీ చేసింది.
ల్యాంకో ప్లాంటులోనికి వెళ్లనివ్వటం లేదు
Published Thu, Dec 13 2018 1:38 AM | Last Updated on Thu, Dec 13 2018 1:38 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment